
రాజస్తాన్‌లో పరిస్థితిపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని పోలీస్ స్టేషన్లలో కెమెరాలు పనిచేయడం లేదని, కస్టడీ మరణాల కేసుల్లో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఇవ్వడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా స్వీకరించింది. పిల్ వేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఆదేశించింది. గత 8 నెలల్లో పోలీసు కస్టడీలో 11 మరణాలు సంభవించాయని హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ వార్తను ధర్మాసనం ప్రస్తావించింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్‌ను కనీసం ఏడాదిపాటు ఉంచాలని 2020లో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. పోలీస్ స్టేషన్ల తరహాలోనే ఇంటెలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, విచారణలు నిర్వహించే, అరెస్టు చేసే అధికారం ఉన్న ఇతర ఏజెన్సీ కార్యాలయాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్టేషన్‌లోని ఏ విభాగాన్ని కూడా బయట నిర్వహించరాదని, అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద కెమెరాలు తప్పనిసరని తెలిపింది.
రాత్రి పూట దృశ్యాలను సైతం వీక్షించగలిగేలా అమర్చాలని, వీడియో, ఆడియో రెండింటినీ రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. పరమ్‌వీర్ సింగ్ సైని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువరించింది. అంతకుముందు, 2015లో డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులోనూ మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నివేదిక కోరగా.. కేవలం 14 మాత్రమే స్పందించాయి. వాటిలోనూ పోలీస్ స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, పనితీరు గురించిన సరైన వివరాలు లేకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.