కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Supreme Court Delivers Landmark Verdict on Compassionate Appointments | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Jun 2 2026 3:23 PM | Updated on Jun 2 2026 3:31 PM

Supreme Court Delivers Landmark Verdict on Compassionate Appointments

సాక్షి,న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులేనని తెలిపింది. వివాహిత కుమార్తెను ‘కుటుంబం’ నిర్వచనం నుంచి మినహాయించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలకు పెళ్లయిన కూతుర్లను మినహాయించకూడదని వెల్లడించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం, బాంబే హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. వివాహం కారణంగా అర్హత ఉన్న కూతురికి సామాజిక సంక్షేమ ప్రయోజనాలు లేకుండా చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ  కేసు మొదలైంది. తన తల్లి మరణం తర్వాత రేషన్ షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఆమెకు ‘వివాహిత కూతురు’ అనే కారణంతో లైసెన్స్ నిరాకరించారు.

ఆమె తన వికలాంగ సోదరిని చూసుకుంటూ, కుటుంబంతోనే నివసిస్తూ తల్లికి సహాయం చేస్తూ షాప్ నడిపేది. అయినప్పటికీ 2019 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఆమె దరఖాస్తు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషనరైన వివాహిత కూతురుకు నాలుగు వారాల్లో రేషన్  షాప్ లైసెన్స్ ఇవ్వాలని  సుప్రీం కోర్టు  యూపీ అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో సుప్రీం కోర్టు మహిళల హక్కులను మరింత బలోపేతం చేసింది. వివాహం తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకు ఇది పెద్ద ఊరట కలిగినట్లైంది. 

Advertisement
 
Advertisement
Advertisement