రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం

Sukhbir Badal Says Akalis Will Review Ties With BJP - Sakshi

సాక్షి, ఢిల్లీ :  రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేద‌ని ఎన్డీయే మిత్ర‌ప‌క్షం శిరోమ‌ణి అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. పార్టీ కోర్ క‌మిటీ దీనిపై సమీక్ష జ‌రిపి  త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.  బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన శిరోమణి అకాలీదళ్‌.. బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్య‌వ‌సాయరంగ బిల్లుల‌పై విప‌క్షాల నుంచే కాక మిత్ర‌ప‌క్షాల నుంచి కూడా వ్య‌తిరేక వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో  ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు, ఆ బిల్లులను ఎస్‌ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. (హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా ఆమోదం)

'హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా ఓ జిమ్మిక్కు'
గ‌త రెండు నెల‌లుగా ఈ బిల్లుల‌పై చ‌ర్చించినా ప్ర‌భుత్వం వెనక్కి త‌గ్గ‌క‌పోవ‌డం భాదాక‌ర‌మ‌న్నారు. రైతుల హ‌క్కుల‌ను కాల‌రాసేలా ప్ర‌భుత్వ ధోర‌ణి ఉందంటూ ఘాటూ వ్యాఖ్య‌లు చేశారు.  రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదని అయితే దీనిపై పార్టీ కోర్ క‌మిటీతో చ‌ర్చించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌న్నారు.  రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.ప్ర‌తిప‌క్ష పార్టీలు సైతం కేంద్రం వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి. కాంగ్రెస్, డీఎంకె త‌దిత‌ర స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించేవ‌ర‌కు బిల్లుల‌ను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక పంజాబ్ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత అమ‌రీంద‌ర్ సింగ్ అకాలీద‌ళ్ చ‌ర్య‌ల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. ఆ పార్టీ ఇప్ప‌టికీ బీజేపీతోనే భాగ‌స్వామిగా ఉంద‌ని, హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా సైతం ఓ బూట‌క‌మేనన్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top