అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న కారణంగా అస్సాంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 34 శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ఇప్పుడు అది 40 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో అత్యధిక జనాభా ముస్లింలదే.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో 126 స్థానాలకుగాను 23 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 188 మంది ముస్లిం అభ్యర్థులు (దాదాపు 26 శాతం) ఉన్నారు. అయితే జనాభాతో పోలిస్తే అస్సాంలో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. బీజేపీ ప్రకటించిన 90 మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు.
అత్యధికం ఆ పార్టీ నుంచే..
పార్టీల వారీగా చూస్తే, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అత్యధికంగా 87 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏజీపీ 46 శాతం మందిని బరిలోకి దింపింది. తృణమూల్ కాంగ్రెస్ 32 శాతం, కాంగ్రెస్ 18 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాయి.
పొత్తుల విషయానికొస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని అస్సాం మహాజోత్ (ఏఎస్ఎం) 128 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. ఇందులో 22 మంది ముస్లింలు (17 శాతం) ఉన్నారు. మరోవైపు నార్త్ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి 127 మంది అభ్యర్థులను బరిలోకి దింపితే.. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ముస్లింలు (10 శాతం) ఉండడం గమనార్హం.
అయితే జనాభాపరంగా దిగువ అస్సాంతో పాటు బరాక్ వ్యాలీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. గౌరీపూర్, జలేశ్వర్, చమారియా, చెంగా నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు, రాష్ట్రంలోని 126 నియోజకవర్గాల్లో 83 నియోజకవర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేరు.
ఈ నియోజకవర్గాలు ప్రధానంగా ఉత్తర అస్సాం, బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్నాయి. దిబ్రూగఢ్‌లోని టిన్సుకియా నుంచి తముల్‌పూర్‌లోని కోక్రాఝర్ వరకు ముస్లిం అభ్యర్థులు లేకపోవడంతో ఇక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లు ఎవరికి పడనున్నాయనేది ఆసక్తిగా మారింది.
స్వతంత్రులతో తలనొప్పి!
జనాభా పరంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముస్లింలు తక్కువగా ఉండడం.. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న 257 మంది అభ్యర్థుల్లో 88 మంది (34 శాతం) ముస్లిం అభ్యర్థులు ఉండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. వీరివల్ల ఓట్ల విషయంలో చీలిక వచ్చే అవకాశముంది.
అస్సాం జనాభాలో మూడింట ఒక వంతు ముస్లింలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. దీంతో ఏప్రిల్ 9న జరగనున్న ఓటింగ్‌లో ముస్లింలు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే అస్సాంలో అభ్యర్థుల భవితవ్యం ముస్లిం ఓటర్లపైనే ఆధారపడి ఉంది.


