పలకరింపు కరువై.. స్మార్ట్‌ఫోన్లకు బందీలై! | Smartphone addiction can increase the likelihood of lonelines | Sakshi
Sakshi News home page

పలకరింపు కరువై.. స్మార్ట్‌ఫోన్లకు బందీలై!

May 23 2026 4:14 AM | Updated on May 23 2026 4:14 AM

Smartphone addiction can increase the likelihood of lonelines

ప్రపంచాన్ని వణికిస్తున్న నిశ్శబ్ద సామాజిక సంక్షోభం

బ్రిటన్, అమెరికాలలో పొరుగింటి పలకరింపులకు దూరమవుతున్న యువత

తెలుగు రాష్ట్రాల మెట్రో నగరాల్లోనూ ‘హైటెక్‌’ఒంటరితనం

వివిధ అధ్యయనాల్లో ఆందోళనకర అంశాలు వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం ఎన్నడూ లేనంతగా సాంకేతికతతో అనుసంధానమైంది. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్ల మోత మోగుతోంది. కానీ విచిత్రంగా పొరుగువారితో, సమాజంతో దూరం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఎంతలా అంటే.. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలి యని పరిస్థితి నెలకొంటోంది. సోషల్‌ మీడియాలో వేలాది మంది ‘ఫ్రెండ్స్‌’ఉంటున్నా అర్ధరాత్రి ఏదైనా ఆపద వస్తే కాపాడేందుకు పక్క ఇంట్లో ఉండే నిజమైన మనిషి దూరమవుతుండటం నేడు ప్రపంచాన్ని సంక్షోభంలా చుట్టుముడుతోంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్‌లో ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడానికి ఏకంగా జాతీయ సంభాషణ ప్రాజెక్ట్‌ ప్రారంభించాల్సి వచ్చింది.

పాశ్చాత్య దేశాల్లో బంధాలకు బీటలు...
బ్రిటన్‌లో సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మాజీ కన్జర్వేటివ్‌ చాన్స్‌లర్‌ సాజిద్‌ జావిద్, లేబర్‌ పార్టీకి చెందిన ప్రముఖ నేత జాన్‌ క్రుడాస్‌ నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిషన్‌ ఏర్పాటైంది. ‘భవిష్యత్తు బ్రిటన్‌ ఎలా ఉండాలి? ఏ బంధాలు ప్రజల్ని కలుపుతున్నాయి? పొరుగువారితో అనుబంధం ఎలా పెరగాలి?’అని ప్రజలనే అడుగుతూ ఒక దరఖాస్తు లేదా నిమిషం నిడివిగల వాయిస్‌ నోట్‌ ద్వారా ఆగస్టుకల్లా అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు.

ఆందోళన పరుస్తున్న అధ్యయనాలు
బ్రిటిష్‌ రెడ్‌ క్రాస్‌ జరిపిన తాజా అధ్యయనంలో 75% మంది బ్రిటన్‌ విభజిత దేశంగా మారిందని.. గత ఐదేళ్లలో ఈ దూరం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఏఈఐ అనే అమెరికన్‌ థింక్‌ ట్యాంక్‌ అధ్యయనం ప్రకారం 2012లో 59% మంది అమెరికన్లు వారంలో పలుమార్లు పొరుగువారితో మాట్లాడేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల మధ్యలోని యువతలో పొరుగు వారితో క్రమం తప్పకుండా మాట్లాడే వారి శాతం 51% నుంచి ఏకంగా 25 శాతానికి తగ్గింది.

ఆరోగ్యానికి ముప్పుగా ‘ఒంటరితనం’...
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని ఒక ప్రజారోగ్య సంక్షోభంగా గుర్తించింది. నిపుణుల అభిప్రా యం ప్రకారం సామాజిక దూరం మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా గుండె జబ్బులు, డిప్రెషన్, అకాల మరణాల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. ప్రపంచంలో ప్రతి ఐదో వ్యక్తి తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నాడని.. దీన్ని ఒక నిశ్శబ్ద సామాజిక సంక్షోభంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం, పొరుగిల్లు, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కలిపేవి. కానీ ఇప్పుడు అల్గారిథమ్స్‌ మనుషుల పరిచయాలను, సంభాషణలను శాసిస్తున్నాయి.

హైదరాబాద్‌ టు వైజాగ్‌ అంతా కాంక్రీట్‌ అరణ్యం.. 
దేశంలో కుటుంబ వ్యవస్థ పశ్చిమ దేశాల కంటే బలంగా ఉందనేది నిజమే అయినా నగరాల వేగం ఈ బంధాలను తుడిచేస్తోంది. హెల్ప్‌ ఏజ్‌ ఇండి యా నివేదిక ప్రకారం భారత్‌లో 69% మంది యువకులు, 68% మంది వృద్ధులు వృద్ధాప్యంలో ఒంటరివాళ్లమైపోతామనే భయంతో బతుకుతున్నా రు.ౖహైదరాబాద్, వైజాగ్‌ వంటినగరాల్లో ఈ సామా జిక దూరం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. 

కారణాలు, ప్రస్తుత పరిస్థితుల అంచనా... 
అపార్ట్‌మెంట్‌ సంస్కృతి: గేటెడ్‌ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లలో పక్క ఫ్లాట్‌లో ఎవరుంటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని ఉదాసీనత పెరిగిపోయింది. లిఫ్ట్‌లో ఎదురైనా బాగున్నారా అనే పలకరింపు కూడా కరువైంది. 

ఉద్యోగ ఒత్తిళ్లు: ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగ వేళలు, వర్క్‌ ఫ్రం హోం సంస్కృతి కారణంగా యువత గదులకే పరిమితమవుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం, సలహాలన్నీ మొబైల్‌ స్క్రీన్‌పైనే లభి స్తుండటంతో పొరుగువారే కాదు.. ఎవరి ఇంటి తలుపులూ తట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. 

మనస్తత్వంతోనే! 
సాంకేతికత మనిషిని స్వయంసమృద్ధుడిగా మార్చింది. కానీ సామాజికంగా ఒంటరిని చేసింది. ఆధునిక సమాజంలో సాంకేతికతను వాడుకుంటూనే మనుషులను మళ్లీ ఎలా అనుసంధానించాలనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్‌. పొరుగువారితో మాట్లాడటం సమయం వృథా కాదు.. అదొక సామాజిక భద్రత అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. 
– డేనియల్‌ కాక్స్, అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్వే సెంటర్‌ డైరెక్టర్‌  

Advertisement
 
Advertisement
Advertisement