
దేశంలో ప్రతి ఐదుగురు నేతల్లో ఒకరు రాజకీయ వారసులే
ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ నివేదికలో సంచలన నిజాలు..
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ప్రతి ఐదుగురిలో ఒకరు (21%) రాజకీయ కుటుంబాల నుంచి వచి్చనవారేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సమగ్ర విశ్లేషణలో తేటతెల్లమైంది.
దేశవ్యాప్తంగా మొత్తం 5,204 మంది ప్రజాప్రతినిధులపై విశ్లేషణ చేయగా, వీరిలో 1,107 మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. లోక్‌సభలో ఈ ప్రభావం అత్యధికంగా 31 శాతంగా ఉంది. ముఖ్యంగా, మహిళా ప్రజాప్రతినిధుల్లో ఈ ధోరణి రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. దాదాపు సగం మంది (47%) వారసత్వంగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని నివేదిక వెల్లడించింది. వారసత్వ రాజకీయాల వాటాలో ఆంధ్రప్రదేశ్ (34%) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్రాల వారీగా తీరిదే..
దేశంలోని రాష్ట్రాలను పరిశీలిస్తే, సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 141 మంది (23%) ప్రజాప్రతినిధులు రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అయితే, మొత్తం ప్రజాప్రతినిధుల్లో వారసుల శాతం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ (34%) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి పైగా వారసులే కావడం గమనార్హం. ఆ తర్వాత మహారాష్ట్ర (32%), కర్ణాటక (29%) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశ్లేషించిన 255 మంది ప్రజాప్రతినిధులలో 86 మంది (34%) వారసులే. మహారాష్ట్రలో 403 మందిలో 129 మంది (32%), కర్ణాటకలో 326 మందిలో 94 మంది (29%), తెలంగాణ మహిళా ప్రజాప్రతినిధులలో 64% మంది వారసత్వ నేపథ్యం కలవారేనని వెల్లడైంది.
మహిళల ప్రాతినిధ్యంలో అసమానతలు:
రాజకీయాల్లోకి మహిళల ప్రవేశానికి కుటుంబ నేపథ్యం ఒక ముఖ్యమైన మార్గంగా మారుతోందని ఈ నివేదికలోని గణాంకాలు పేర్కొన్నాయి. మొత్తం మహిళా ప్రజాప్రతినిధులలో 47% మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే. పురుషులలో ఈ సంఖ్య కేవలం 18% మాత్రమే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 69% మహిళా ప్రతినిధులు, తెలంగాణలో 64% మంది వారసులే కావడం గమనార్హం. రాష్ట్రాల అసెంబ్లీల (20%) కన్నా లోక్‌సభలో (31%) వారసత్వ ప్రభావం ఎక్కువగా ఉంది. జాతీయ రాజకీయాలపై కుటుంబాల పట్టు బిగుస్తున్నట్లు ఇది సూచిస్తోంది. పారీ్టలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ‘గెలుపు గుర్రం’అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం, డబ్బు, కండబలం వంటివి వారసత్వ రాజకీయాలకు కారణమవుతున్నాయి. భారతీయ సమాజంలో కుటుంబ సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యత కూడా వారసులను ఓటర్లు ఆమోదించడానికి ఒక కారణంగా నిలుస్తోంది.