
చంద్రబాబు కేబినెట్‌లో 96% మందిపై క్రిమినల్ కేసులు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19.. నారా లోకేశ్‌పై 17 క్రిమినల్ కేసులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై 8..
రూ.5,705 కోట్లతో అత్యంత సంపన్న కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్
ఏడీఆర్ – ఎన్‌ఈడబ్ల్యూ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధికంగా చంద్రబాబు మంత్రివర్గంలో నేర చరితులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 96 % మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి రూపొందించిన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు 27 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మంత్రులకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు ఉండగా మంత్రి నారా లోకేశ్‌పై 17 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన టాప్ 10 అధికార పార్టీల ప్రజా ప్రతినిధుల్లో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.931 కోట్ల సంపదతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నారు.
రూ.824 కోట్లతో మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నాలుగో స్థానంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రూ.542 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అతి తక్కువ ఆస్తులు కలిగిన వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15.38 లక్షలతో ఎనిమిదో స్థానంలో ఉండటం గమనార్హం.

కేంద్ర మంత్రుల్లో బండి సంజయ్ టాప్..
కేంద్ర మంత్రుల్లో తెలంగాణకు చెందిన బండి సంజయ్ కుమార్‌పై 42, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై 3, నితిన్ గడ్కరీపై 10, కింజరాపు రామ్మోహన్ నాయుడుపై 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. హరియాణ, జమ్మూ–కశ్మిర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఒక్క మంత్రిపైనా కేసు లేదు.

⇒ తెలంగాణలో క్రిమినల్ కేసులకు సంబంధించి సీఎం అనుముల రేవంత్‌రెడ్డి (89), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (3), జూపల్లి కృష్ణారావు (3), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (6), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (5), గడ్డం వివేకానంద (5), కొండా సురేఖ (5), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (13), ఉత్తమ్ కుమార్ రెడ్డి (11), పొన్నం ప్రభాకర్ (7), సీతక్క (6) కేసులు ఉన్నాయి.