బడ్జెట్‌లో మధ్య తరగతికి, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు
లోక్‌సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: 2016–17 కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజల సంక్షేమంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) కోసం అనే ప్రోత్సాహకర చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సంస్కరణలను తప్పనిసరి పరిస్థితుల వల్ల కాకుండా.. దృఢ సంకల్పంతో, పూర్తి స్పష్టతతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. సంస్కరణల విషయంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.
ఆర్థిక బిల్లు– 2026పై లోక్‌సభలో జరిగిన చర్చకు మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సమాధానమిచ్చారు. 2026–27 ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2021లో ఇది 9.3 శాతంగా ఉందన్నారు. దేశంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి కూడా తగ్గిపోతోందని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే మన దగ్గరే ఈ నిష్పత్తి తక్కువగా ఉందని వివరించారు.
ఐదు కీలక సూత్రాలపై ఆర్థిక బిల్లు ఆధారపడి ఉన్నట్లు స్పష్టంచేశారు. విశ్వాసం ఆధారిత పన్నుల వ్యవస్థ, ప్రజల సులభతర జీవనం, రైతుల ఎంఎస్‌ఎంఈలు, సహకార సంఘాల సాధికారత, దేశాన్ని గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తీర్చిదిద్దడం, నిరాటంకమైన వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సంస్కరణలే ఈ బిల్లు ఆధారమని వెల్లడించారు. బడ్జెట్‌లో మధ్యతరగతిని విస్మరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు.
ఫైనాన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఫైనాన్స్ బిల్లు–2026కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 32 సవరణలు ఆమోదం పొందాయి. సభలో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. దీంతో లోక్‌సభలో బడ్జెట్‌కు సంబంధించి అనుమతుల ప్రక్రియ ముగిసింది. ఫైనాన్స్ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ఆమోదించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు తెలిపారు. గురువారం సెలవు కాబట్టి శుక్రవారం ఫైనాన్స్ బిల్లుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.


