బూస్టర్‌కు డాక్టర్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు

Senior Citizens no Need Prescription for Third Covid Dose - Sakshi

60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలుంటే ప్రికాషన్‌ టీకా తీసుకోవచ్చు

టీనేజర్లకు కొన్ని ప్రత్యేక టీకా కేంద్రాలు

రెగ్యులర్‌ టీకా కేంద్రాల్లోనూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు

కోవిన్‌ పోర్టల్‌తో పాటు ఆన్‌సైట్‌లోనూ రిజిస్ట్రేషన్లు

ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లే

న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బూస్టర్‌ డోసు (ప్రికాషన్‌ డోసు)ను తీసుకొనేటపుడు.. తమ ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి  ఎలాంటి డాక్టర్‌ సర్టిఫికెట్‌ను చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. 15–18 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ మంగళవారం వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ జనవరి 3 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బూస్టర్‌డోసును జనవరి 10 తేదీ నుంచి ఇస్తారు. ఈ రెండు కేటగిరీల్లో వారికి విధివిధానాలను వివరిస్తూ రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు...

► 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారు బూస్టర్‌ డోసు కోసం డాక్టర్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన/ అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు.
► వీరు బూస్టర్‌ తీసుకొనే ముందు తమ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.
► ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పరిగణిస్తారు. వీరు కూడా బూస్టర్‌ డోసుకు అర్హులు. అందరిలాగే రెండోడోసు తీసుకున్న 9 నెలలు/ 39 వారాల తర్వాత బూస్టర్‌ తీసుకోవచ్చు.
► టీనేజర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న టీకా కేంద్రాల్లో కొన్నింటిని టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేసే అవకాశం  రాష్ట్రాలకు ఉంది.  
► వయోజనులకు టీకాలు వేస్తున్న రెగ్యులర్‌ కేంద్రాల్లోనూ టీనేజర్లు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లు మిక్స్‌ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు.  
► టీనేజర్లు జనవరి 1 నుంచి కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. లేదా 3వ తేదీ నుం చి నేరుగా కేంద్రాలకు వెళ్లి అన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. తొలిడోసు తీసుకొన్న 28 రోజుల తర్వాత రెండోడోసు తీసుకోవచ్చు.
► టీనేజర్లకు ఇవ్వడానికి ప్రస్తుతం ఒక్క కోవాగ్జిన్‌ మాత్రమే అందుబాటులో ఉన్నందువల్ల... దీని సరఫరా షెడ్యూల్‌ను రాష్ట్రాలకు త్వరలో కేంద్రం తెలియజేస్తుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top