సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!

Security agencies seek 4-6 dedicated satellites for keeping close eye on China - Sakshi

ఆరు శాటిలైట్లు అవసరమవుతాయని భద్రతా సంస్థల ప్రాథమిక అంచనా

రక్షణ శాఖ నివేదికలో  ‘అతిక్రమణ’ ప్రస్తావన

కొంతకాలానికి వెబ్‌సైట్‌లో నివేదిక మాయం!

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్‌ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్‌ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్‌సైట్‌ నుంచి అదృశ్యమవడం గమనార్హం.

భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది.

ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్‌ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్‌ ప్రాంతంలోని భారత్‌ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్‌ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు.  

వెనక్కు తగ్గేందుకు ససేమిరా...
గల్వాన్‌ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్‌ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్‌ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే.

హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

చైనాపై విరుచుకుపడ్డ భారత్‌
తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్‌ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్‌ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్‌ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్‌ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్‌ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top