
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి మరింత దిగజారింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య విద్యార్థుల భద్రత దృష్ట్యా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు (మంగళవారం)పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.
ఢిల్లీ, గురుగ్రామ్‌లో..
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సెప్టెంబర్ 2న ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. ఇదేవిధంగా హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాల నేపధ్యంలో మంగళవారం అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
చండీగఢ్
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చండీగఢ్ అతలాకుతలమైంది. ప్రధాన కార్యదర్శి (ఇన్-ఛార్జ్) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంగళవారం అన్ని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.
ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్, ముజఫర్‌నగర్, మీరట్, బరేలీ, మొరాదాబాద్, పిలిభిత్, అలీఘర్‌తో సహా పలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల కారణంగా మంగళవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని లక్నోలోని వాతావరణ కేంద్రంలోని సీనియర్ శాస్త్రవేత్త అతుల్ కుమార్ సింగ్ తెలిపారు.
జమ్ము డివిజన్‌లో
జమ్ము డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డివిజన్‌లోని అన్ని పాఠశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జమ్ము విశ్వవిద్యాలయం అన్ని పరీక్షలను సెప్టెంబర్ 4 వరకు వాయిదా వేసింది. స్థానిక వాతావరణ శాఖ సెప్టెంబర్ 2,3 తేదీల్లో డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
చమోలి (ఉత్తరాఖండ్)
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో అతి భారీ వర్షపాతం అంచనాల దృష్ట్యా ఒకటి నుండి 12 తరగతుల వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్, హేమకుండ్ సాహిబ్ తీర్థయాత్రలను సెప్టెంబర్ 5 వరకు నిలిపివేశారు.
హిమాచల్ ప్రదేశ్
కొండచరియలు విరిగిపడే ముప్పు కారణంగా కాంగ్రా, మండి, సిర్మౌర్, కులులోని పాఠశాలలను మంగళవారం మూసివేశారు. సిమ్లా, కిన్నౌర్, సోలన్, ఉనా, చంబాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.