
సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్
న్యూఢిల్లీ: దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మధ్యవర్తిత్వం, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాల్లో మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య విడదీయరాని బంధం కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అదేసమయంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్ గవాయ్ వివరించారు.
జస్టిస్ ఓకా పని రాక్షసుడు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకా తనకు మంచి మిత్రుడు, పని రాక్షసుడు జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. జస్టిస్ ఓకా ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు అడ్వొకేట్–ఆన్–రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. జస్టిస్ ఓకాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. జస్టిస్ ఓకా మాట్లాడుతూ.. జస్టిస్ గవాయ్ అసలైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు.