కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీలో లుకలుకలు ఒకటొకటి బయటపడుతున్నాయి. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ మాజీ ఎంపీ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి పంపానన్నారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఉదంతంపై తమ పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. అనైతిక చర్యల కారణంగానే ఎన్నికల్లో ప్రజలు పార్టీని తిరస్కరించారని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను టీఎంసీ ఆవిర్భావం నుంచి విధేయత కలిగిన సైనికుడిగా ఉన్నానంటూ..పార్టీ వివాదాలను బహిరంగంగా సమర్థించడం తనకు నైతికంగా ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు.
కాగా, ఆర్‌జీకర్ ఉదంతంపై నిరసన గళం వినిపించిన అతికొద్ది మంది టీఎంసీ నేతల్లో శంతను సేన్ ఒకరు. దీనిపై అప్పట్లో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తిరిగి పార్టీలో చేర్చుకుంది. బుధవారం సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్, పార్టీ అధికార ప్రతినిధి, టీఎంసీ కౌన్సిలర్లు అనూప్ చక్రవర్తి, సుశాంత ఘోష్ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు.


