
ఊబకాయం ముప్పును బాల్యంలోనే పసిగట్టేలా
500 సంస్థలు చేపట్టిన ప్రపంచస్థాయి అధ్యయనం
ఇందులో చేతులు కలిపిన ‘సీఎస్‌ఐఆర్–సీసీఎంబీ’
వివిధ దేశాల ప్రజల జన్యు సమాచారంపై పరిశోధన
సాక్షి, స్పెషల్ డెస్క్: ఊబకాయం.. దాదాపు ప్రతి ఇంటా వింటున్న ఆరోగ్య సమస్య. ఇదొక్కటే ఉండదు.. గుండెజబ్బులు, కేన్సర్లు, మధుమేహం లాంటి వాటినీ ఒంటికి తీసుకొస్తుంది. మరి, అలాంటి స్థూలకాయం మనకు వస్తుందో రాదో బాల్యంలోనే తెలిసిపోతే? ఎంచక్కా నివారణ చర్యలు తీసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం సంస్థ, హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–సీసీఎంబీ భాగస్వామిగా ఉన్న ప్రపంచస్థాయి అధ్యయనం ఈ విషయంలో విజయం సాధించింది. వీళ్లు రూపొందించిన పాలిజెనిక్ రిస్క్ స్కోర్ (పీఆర్‌ఎస్).. స్థూలకాయం ముప్పును ముందే పసిగడుతుంది. పెరిగి పెద్దయ్యాక ఊబకాయం వస్తుందా రాదా అనే విషయాన్ని బాల్యంలోనే తెలుసుకునే కిటుకు దొరికింది.
అంటే.. చిన్నప్పుడే తెలిస్తే.. భవిష్యత్తులో స్థూలకాయం రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా సాగిన సుదీర్ఘ అధ్యయనం సాధించిన విజయం. ఇందులో భాగంగా స్థూలకాయానికి జన్యుపరమైన కొత్త కారణాలు తెలుసుకునే తెలుసుకునేందుకు, ఐదు సంవత్సరాల వయసు నుంచే ఊబకాయం వచ్చే అవకాశాన్ని అంచనా వేయగల పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌ను (పీఆర్‌ఎస్) రూపొందించారు. ఇందులో మనదేశం నుంచి మైసూరు, ముంబై, పుణే నగరాలకు చెందినవారు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 51 లక్షల మంది వ్యక్తుల జన్యు సమాచారాన్ని ఉపయోగించి పీఆర్‌ఎస్ మోడల్ రూపొందించారు. గతంలో రూపొందించిన మోడల్స్ కంటే ఇది రెండింతలు ప్రభావవంతంగా ఉందని తేలింది. సీఎస్‌ఐఆర్–సీసీఎంబీతో సహాఊబకాయంపై చేపట్టిన ఈ అధ్యయనంలో హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్‌ఐఆర్– సీసీఎంబీ), ఎల్వీ ప్రసాద్ కంటి ఆసు పత్రి, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సహా ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 600 మందికి పైగా శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న 51 లక్షల మందిలో.. ఆఫ్రికన్లు (4.6%ప్రజలు), అమెరికన్లు (14.4%), తూర్పు ఆసియా (8.4%), ఐరోపా (71.1%), దక్షిణాసియా వాసులు(1.5%) ఉన్నారు. ప్రముఖ జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. జన్యువుల కారణంగానే ఊబకాయం ముప్పు అత్యధికంగా ఉందని వెల్లడించింది. అంటే తల్లి/తండ్రికి ఈ సమస్య ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశాలే అధికం. కానీ వీరు జీవనశైలి మార్పులతో దీన్ని దూరం చేసుకోవచ్చు. అంటే శారీరక శ్రమ చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వంటివి చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వీరు మానేస్తారో మళ్లీ వెంటనే తిరిగి బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది.
ముందస్తు హెచ్చరికగా..
ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒకరికి.. వారు యుక్త వయసుకు వచ్చేసరికి ఊబకాయం వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని అంచనా వేయగల సామర్థ్యం ఈ స్కోర్‌కు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ముందస్తు హెచ్చరిక సాధనంగా పీఆర్‌ఎస్ పనిచేస్తుంది. అంటే సమస్య వస్తుందని తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచే సరైన ఆహారం, వ్యాయామం ద్వారా సమస్య నుంచి గట్టెక్కవచ్చన్నమాట. ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత విస్తృత విభిన్న తరాల అధ్యయనాలలో ఇది ఒకటి.
యూరోపియన్లలో ఊబకాయానికి కారణమైన జన్యు రకాలు.. భారతీయులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఈ అధ్యయనంలో గుర్తించారు. భవిష్యత్తులో భారతీయులకు ప్రత్యేకంగా పీఆర్‌ఎస్ రూపొందించాలని మన శాస్త్రవేత్తలు భావించారు. అంతేకాదు, ఈ స్కోరుతో కేవలం ఊబకాయమే కాదు.. గుండె సంబంధ సమస్యలనూ పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, అందుకు పరిశోధనలు చేయాల్సి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నవారి సంఖ్య 1990లో 92.9 కోట్లు. 2021 నాటికి 260 కోట్లకు పెరిగిందని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ళీ 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువు, ఊబకాయం బారిన పడవచ్చని ప్రపంచ ఊబకాయ సమాఖ్య హెచ్చరించింది.
అధిక బరువు, ఊబకాయం ఉన్న పెద్దలలో సగం కంటే ఎక్కువ మంది చైనా, భారత్, యూఎస్, బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇండోనేషియా, ఈజిప్ట్ దేశాలలో నివసిస్తున్నారు.ళీ 2035 నాటికి 79% పెద్దలు, 88% మంది పిల్లలు ఊబకాయం, అధిక బరువుతో తక్కువ–మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తారు. 7% దేశాలు మాత్రమే ఊబకాయంతో ముడిపడిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి తగిన ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉన్నాయి.