ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్‌ బద్ర్‌ కన్నుమూత | Renowned Urdu Poet Bashir Badr Passes Away | Sakshi
Sakshi News home page

ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్‌ బద్ర్‌ కన్నుమూత

May 29 2026 7:19 AM | Updated on May 29 2026 7:19 AM

Renowned Urdu Poet Bashir Badr Passes Away

‘ఉజాలే అప్నీ యాదోం కే హమారే సాథ్‌ రెహ్నే దో’

భోపాల్‌: ‘‘ఉజాలే అప్నీ యాదోం కే హమారే సాథ్‌ రెహ్నే దో’వంటి పంక్తులతో సాహితీ లోకంలో విశేషంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్‌ బద్ర్‌ దీర్ఘకాలిక అనారోగ్యంతో గురువారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న బషీర్‌ బద్ర్‌ భోపాల్‌లోని స్వగృహంలో కన్నుమూశారని ఆయన కుమారుడు సయ్యద్‌ బద్ర్‌ తెలిపారు. తమ కుటుంబానికి, ఆప్తులకు, అభిమానులకు ఇది చాలా బాధాకరమైన రోజు అని చెప్పారు. తన తండ్రి ప్రేమ, జీవితానికి సంబంధించిన కవిత్వంతో సాహిత్య ప్రియుల హృదయాల్లో చెరగ ని ముద్ర వేశారని పేర్కొన్నారు. జ్ఞాపకశక్తి క్షీణించడం మొదలయ్యాక జన సమూహానికి దూరమయ్యారని వెల్లడించారు. గత పదేళ్లుగా కవి సమ్మేళనాల్లో పాల్గొనడం లేదన్నారు.

ఏడేళ్ల వయసులోనే సాహిత్య ప్రయాణం..
బషీర్‌ బద్ర్‌ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 1935 ఫిబ్రవరి 15న జన్మించారు. బాల్యంలోనే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉర్దూ బాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఏడేళ్ల వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు. మొదట గజల్స్‌ రాశారు. ఆయనకు పర్షియన్, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ మంచి పట్టుంది. అవార్డులు గెలుచుకున్న 69 గజల్స్‌తో ‘ఆస్‌’అనే సంకలనం విడుదల చేశారు. ఇది బద్ర్‌ కవితా కిరీటంలో ఒక ఆభరణంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా 1999లో ఆయనకు ఉర్దూలో సాహిత్య అకాడమీ అవార్డును సంపాదించి పెట్టింది. బద్ర్‌ సంకలనాల్లో ఒకటైన ‘కులియతే బషీర్‌ బద్ర్‌’ను పాకిస్తాన్‌లో కూడా ప్రచురించారు.

బషీర్‌ బద్ర్‌ ఉర్దూలో ఏడుకు పైగా కవితా సంకలనాలు, హిందీలో ఒక సంకలనాన్ని వెలువరించారు. రెండు సాహిత్య విమర్శ పుస్తకాలు కూడా రాశారు. కొన్ని ఉర్దూ గజల్స్‌ను ‘ఉజాలే అప్నీ యాదోంకే’పేరిట దేవనాగరి లిపిలో తీసుకొచ్చారు. ఆయన రచనలు గుజరాతీ బాషలోనూ ప్రచురితమయ్యాయి. ఆంగ్లం, ఫ్రెంచ్‌ భాషల్లోకి అనువాదం చేశారు. సాహిత్య రంగానికి చేసిన సేవకు గాను బషీర్‌ బద్ర్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఉత్తరప్రదేశ్‌ ఉర్దూ అకాడమీ నుంచి నాలుగు సార్లు, బిహార్‌ ఉర్దూ అకాడమీ నుంచి ఒకసారి పురస్కారాలు పొందారు. సాహితీ సంస్థల నుంచి పలు అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.

మీరట్‌లో చేదు అనుభవాలు..
బషీర్‌ బద్ర్‌ జీవితం సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1987 ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మత కలహాలు జరిగినప్పుడు బషీర్‌ బద్ర్‌ ఇంటిని దుండగులు దహనం చేశారు. ఆయన రాసిన పుస్తకాలు, ప్రచురితం కాని గ్రంథాలకు సైతం నిప్పు పెట్టారు. ఈ సంఘటన తర్వాత ఆయన భోపాల్‌కు వలస వెళ్లారు. అక్కడే కొత్త జీవితం ఆరంభించారు. బద్ర్‌కు ప్రయాణాలంటే ఇష్టం. తన రచనలకు ఉన్న విస్తృతమైన పాఠకవర్గం కారణంగా అమెరికా, దుబాయ్, ఖతార్, పాకిస్తాన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో పర్యటిచారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. బద్ర్‌ మరణం పట్ల బాలీవుడ్‌ రచయిత జావెద్‌ అక్తర్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement