అడవిపై హక్కులు కాలరాసేందుకే వనవాసి అంటున్నారు: రాహుల్‌ | Rahul Gandhi targets RSS, BJP over Vanvasi term for tribals | Sakshi
Sakshi News home page

అడవిపై హక్కులు కాలరాసేందుకే వనవాసి అంటున్నారు: రాహుల్‌

Mar 24 2026 4:36 AM | Updated on Mar 24 2026 4:36 AM

Rahul Gandhi targets RSS, BJP over Vanvasi term for tribals

వడోదర: అడవిపై ఆదివాసీలకు హక్కులు దక్క కుండా చూసేందుకే వాళ్లను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వనవాసులు అని సంబోధిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ‘ఆదివాసీ అధికార్‌ సంవిధాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఆదివాసీలే భారత్‌కు అసలైన యజమానులు. వేయి, రెండు వేలు, ఐదు వేల ఏళ్ల క్రితంనాటి పరిస్థితులను చూస్తే భారత్‌లోని ఈ భూభాగంలో ప్రతి అంగుళం ఆదివాసీలకే చెందుతుంది. ఇప్పుడు 21వ శతాబ్దం వచ్చేసరికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కొత్తగా వనవాసి అనే పదం మాత్రమే ఉపయోగిస్తున్నాయి. 

వనవాసి అంటే వనంలో ఉండే వాళ్లు అనే అర్థంవస్తుందిగానీ భూమికి యజమానులు అనే భావన రాదు. అందుకే ఆదివాసీలకే ఈ నేల, నీరు, అడవిపై హక్కులు దక్కకూడదనే దురుద్దేశంతో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ నేతలు ఆదివాసీలను కేవలం వనవాసులు అని పిలుస్తున్నారు. ఆదివాసీలను వనవాసులు అనడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే. గిరిజనయోధుడు బిర్సా ముండాను అవమానించడమే’’ అని రాహుల్‌ అన్నారు. ‘‘ బిర్సాముండా, అంబేడ్కర్, ఫులే, గాంధీజీల విగ్రహాలకు మోదీసహా బీజేపీ సభ్యులు ప్రణమిల్లుతారుగానీ ఆ మహనీయుల సిద్ధాంతాలను పరిరక్షించాలన్న స్పృహే వీళ్లకు లేదు. అభివృద్ధి అన్న ప్రతిసారీ అటవీభూములను ఆదివాసీల నుంచి లాక్కొంటారు.’’ అని రాహుల్‌ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement