ఐశ్వర్య ఆత్మహత్య.. రాహుల్‌ స్పందన

Rahul Gandhi Over Telangana Student Aishwarya Suicide - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా హస్టల్‌ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయించడంతో మనస్తాపానికి గురైన షాద్‌నగర్‌ డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్‌ చేశారు. (చదవండి: స్కూల్‌ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!)

షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్‌ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్‌ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్‌షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్‌షిప్‌ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్‌ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top