ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాకు సొంత పార్టీ షాక్ | Raghav Chadha removed as AAP Rajya Sabha deputy leader | Sakshi
Sakshi News home page

ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాకు షాక్ ఇచ్చిన ఆప్‌

Apr 2 2026 2:30 PM | Updated on Apr 5 2026 12:01 AM

Raghav Chadha removed as AAP Rajya Sabha deputy leader

న్యూఢిల్లీ: సామాన్యుల స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. సెల్‌ఫోన్ రీచార్జిలో ప్రైవేటు టెలికం కంపెనీల దోపిడీపై ఆయ‌న లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. అలాగే మొబైల్ డేటా వినియోగంలో టెలికం కంపెనీల వైఖ‌రిని కూడా చ‌ట్ట‌స‌భ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. అంతేకాదు మ‌హా న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య గురించి కూడా రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. మినిమ‌మ్ బ్యాలెన్స్ పేరుతో సామాన్యుల‌ను బ్యాంకులు ఇబ్బందులు గురిచేస్తున్నాయ‌ని స‌వివ‌రంగా వివ‌రించారు.

పార్ల‌మెంట్‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్న రాఘ‌వ్ చ‌ద్దాకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడి ప‌ద‌వి నుంచి ఆయ‌నను తొల‌గించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించింది. దీనికి సంబంధించి రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా,  రాఘ‌వ్ చ‌ద్దా 2023 నుంచి రాజ్య‌స‌భ‌లో ఆప్ ఉప నాయకుడిగా ఉన్నారు.

కార‌ణం అదేనా?
రాఘ‌వ్ చ‌ద్దా వైఖ‌రిపై అగ్ర‌నాయ‌క‌త్వం ఆగ్ర‌హం కార‌ణంగానే ఆయ‌న ప‌ద‌వి పోయిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీకి అంటిముట్ట‌న్న‌ట్టు ఉంటున్నార‌ని ఆయ‌నపై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. పార్టీకి సంబంధించిన కీల‌క అంశాల‌పై స్పందించ‌కుండా మౌనం వ‌హించ‌డంపై అధినాయ‌క‌త్వం ఆయ‌నపై గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాల‌ను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించినా రాఘ‌వ్ చ‌ద్దా నుంచి స్పంద‌న లేదు. సోష‌ల్ మీడియాలోనూ ఎటువంటి పోస్ట్ పెట్ట‌క‌పోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. 

అగ్ర‌నేత‌ల‌కు ఊర‌ట ల‌భించినా చ‌ద్దా స్పందించ‌క‌పోవ‌డంపై పార్టీలో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అంతేకాదు ప‌లుమార్లు పార్టీ కీల‌క స‌మావేశాల‌కు గైర్హాజ‌రయ్యారు. గ‌తంలో కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు చ‌ద్దా. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు ఆల‌స్యంగా స్పందించారు. బ్రిట‌న్‌లో కంటి ఆప‌రేష‌న్ చేయికున్నందునే ఆల‌స్యంగా స్పందించాన‌ని అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చారు.

ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్ ఇచ్చిన ఆప్

ఒక‌ప్పుడు కేజ్రీవాల్‌కు స‌న్నిహితుడు
చార్టర్డ్ అకౌంటెంట్ అయిన 37 ఏళ్ల రాఘ‌వ్‌ చ‌ద్దా, 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రారంభమైనప్పటి నుండి ఆ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. గ‌తంలో కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న పార్టీకి జాతీయ కోశాధికారిగా పనిచేశారు. అత్యున్నత నిర్ణయాధికార విభాగ‌మైన రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగానూ ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ను సమన్వయం చేయడంలో కూడా చ‌ద్దా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సలహాదారుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కో-ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

చ‌ద‌వండి: చేతుల్లో ఏమీ లేదు.. అంతా బీజేపీ గేమ్‌ప్లాన్‌

Advertisement
 
Advertisement
Advertisement