‘ఐ లైక్‌ యూ’ అంటూ ఆమెకు మెసేజ్‌ పెట్టాడు.. తర్వాత పోలీసుల రిప్లై చూసి షాకయ్యాడు

Punjab Police Epic Response To Twitter User For I Like You Message - Sakshi

చెరపకురా చెడేవు అంటే ఇదేనేమో.. తన పని తాను చూసుకోకుండా.. సోషల్‌ మీడియా ఉంది కాదా అని ఓ వివాహితకు ‘ఐ లైక్‌ యూ’ అని మెసేజ్‌ పెట్టాడు ఓ ప్రబుద్దుడు. ఎవరో తెలియని వ్యక్తి ఇలా మెసేజ్‌ పెట్టడం ఏంటని ఆమె షాకైంది. 

ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. రంగంలోకి దిగిన సదరు భర్త.. ప్రబుద్ధుడికి వివరాలు తెలుసుకుని ఇంటికి వెళ్లి మరీ దేహశుద్ది చేసి.. గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో, బాధితుడు.. ట్విట్టర్‌ వేదికగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పాడు. దానికి పోలీసులు సమాధానం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఓ మహిళ మొబైల్‌కి నువ్వంటే నాకు ఇష్టం (I Like You) అని ఓ వ్యక్తి మెసేజ్ పెట్టాడు. దీంతో ఆమె భర్త వచ్చి.. అతడిని చితకబాదాడు. అనంతరం జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్విట్టర్‌ వేదికగా "సార్.. నేను ఒకరికి I like u మెసేజ్ పంపాను. ఆమె భర్త  వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. నేను చాలాసార్లు క్షమించమని అడిగాను. అయినా సరే అతను కొట్టాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలి అనిపిస్తోంది. దయచేసి ఏదైనా చెయ్యండి. నన్ను కాపాడండి. ఆయన మళ్లీ నాపై దాడి చేసే అవకాశం ఉంది’’ అని రాసుకొచ్చాడు. 

దీనికి పోలీసులు ట్విట్టర్‌ వేదికగానే బదులిస్తూ.. "మీరు ఓ మహిళకు అలా మెసేజ్‌ పెట్టి ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారో మాకు తెలియదు. ఆమె భర్త మాకు ఫిర్యాదు చేయకుండా మిమ్మల్ని అలా కొట్టడం కూడా కరెక్ట్‌ కాదు. మేము మీకు సరైన సెక్షన్ కింద సరైన శిక్ష వేస్తాం. ఈ రెండు అంశాలకూ చట్ట ప్రకారం దర్యాప్తు ఉంటుంది. ఇద్దరి పైనా చట్టప్రకారం చర్యలుంటాయి" అని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు.. మీ సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి అని స్పష్టం చేశారు. కాగా, ఇలాంటి రియాక్షన్‌కు ఖంగుతిన్న బాధితుడు కామ్‌గా ఉండిపోయాడు. దీంతో, వీరి మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top