గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్‌ చలాన్లు రద్దు చేస్తా: సీఎం

Punjab CM Says Govt Will Waive off Pending Challans of Auto Drivers - Sakshi

సంచలన ప్రకటన చేసిన పంజాబ్‌ సీఎం

ఆటోడ్రైవర్లపై వరాల జల్లు కురిపించిన చన్నీ

చండీగఢ్‌: ఆటోడ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ. వారి ఆటోలపై ఉన్న పెండింగ్‌ చలాన్లు అన్నింటిని రద్దు చేసి.. వారికి కొత్త రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తానని ప్రకటించారు. సోమవారం లూథియానాలోని గిల్ చౌక్ ప్రాంతంలోని ధాన్యం మార్కెట్‌కు వెళ్తున్న చన్నీ.. మార్గ మధ్యంలో తన వాహనాన్ని ఆపి.. ఆటోడ్రైవర్లతో భేటీ అయ్యాడు. వారితో పాటు చెక్కమీద కూర్చుని.. టీ తాగి.. వారి సమస్యలను విన్నారు సీఎం చన్నీ. 

ఈ సందర్భంగా సీఎం చన్నీ మాట్లాడుతూ.. ప్రారంభంలో రాజకీయాల్లోకి రాకముందు తాను ఆటో డ్రైవర్‌గా పని చేశానని తెలిపాడు. వారి నిజమైన డిమాండ్లను సానుభూతితో పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆటోల మీద ఉన్న పెండింగ్‌ చలాన్లు అన్నింటిని రద్దు చేస్తానని ప్రకటించాడు. అంతేకాక అధికారుల వేధింపులను అరికట్టేందుకు త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తానని ప్రకటించారు. 
(చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!)

ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు ట్రాఫిక్‌ నియమానలు పాటించాలని సీఎం చన్నీ సూచించాడు. ఇక రోడ్డు మీద ఆటో రిక్షాలు నడపడానికి ప్రత్యేకంగా పసుపు గీత గీసి స్థలాన్ని కేటాయించాలని కోరిన ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని చన్నీ అంగీకరించాడు. ఈ పర్యటనలో చన్నీతో పాటు సిద్ధూ, మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, ఎమ్మెల్యేలు కుల్దీప్ సింగ్ వైద్, సంజయ్ తల్వార్, లఖ్‌బీర్ సింగ్ లఖా కూడా ఉన్నారు. 
(చదవండి: పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం)

అయితే చన్నీ చర్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే.. త్వరలోనే కేజ్రీవాల్‌ పంజాబ్‌ ఆటో డ్రైవర్లతో ఆటో సంవాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికి ముందే చన్నీ వారితో భేటీ అయ్యి.. చలాన్లు రద్దు చేస్తానని ప్రకటించి.. కేజ్రీవాల్‌కు షాక్‌ ఇచ్చారు. 

చదవండి: రాహుల్‌ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top