పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం? | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?

Published Sat, Jan 9 2021 4:49 AM

Puducherry District Collector served with toxic liquid in mineral water - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్‌లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్‌ పూర్వగార్గ్‌ వాటర్‌ బాటిల్‌ తెరవగానే స్పిరిట్‌ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాటిల్‌లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ఖండించారు.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు.  

Advertisement
Advertisement