పీడీ.. వ్యక్తిగత స్వేచ్ఛపై దండయాత్రే: సుప్రీం

Preventive detention serious invasion of personal liberty says Supreme Court  - Sakshi

న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధం(పీడీ) అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన దండయాత్రేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు చేపట్టే విషయంలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021 నవంబర్‌ 12న త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన పీడీ ఉత్తర్వును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్, జస్టిస్‌ జేబీ పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. పీఐటీఎన్‌డీపీఎస్‌ చట్టం–1988 కింద అరెస్టు చేసిన నిందితుడిని వెంటనే విడుదల చేయాలని çఆదేశించింది. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తే నిందితులు ఏడాదిపాటు జైల్లోనే ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తమపై నమోదైన కేసుల్లో నిరపరాధినని నిరూపించుకొనే అవకాశం లేకుండా పోతోందంది.   

ప్రచారం కోసం ఇక్కడికి రావొద్దు
కేవలం ప్రచారం కోసం న్యాయస్థానానికి రావొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎంల)ను ఎన్నికల సంఘం (ఈసీ) కాకుండా కొన్ని కంపెనీలు నియంత్రిస్తున్నాయంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్‌ వికాస్‌ పార్టీ వేసిన పిటిషన్‌పై Ôజస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఏఎస్‌ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు వాడకంలో ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఇది. ఓటర్ల ఆదరణ పెద్దగా పొందలేని ఓ రాజకీయ పార్టీ ఇటువంటి పిటిషన్ల ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని ధర్మాసనం పేర్కొంది.   నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు గ్రూప్‌–సి ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రూ.50 వేలు జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top