
ఢిల్లీ: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, రాష్ట్ర బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై తాజాగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పందించారు.
ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు పశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలను, బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు. అయితే, ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్‌కు ఎలాంటి గడువును ఆర్టికల్ 200లో పేర్కొనలేదని అన్నారు.
సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..
రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా?.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?.
రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా?
రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?.
సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?.
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?.
రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా? అని ప్రశ్నించారు.
Big showdown brews between Rashtrapati Bhavan & Supreme Court
President Droupadi Murmu invokes Article 143, seeking clarity on SC's ruling that set deadlines for Tamil Nadu Governor RN Ravi to act on bills—without Centre's nod. CJI Gavai to form a Constitution Bench
Key… pic.twitter.com/1DShRAn21P— Nabila Jamal (@nabilajamal_) May 15, 2025
సుప్రీంకోర్టు తీర్పు ఇదే..
తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి!. ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్‌లర్ల బిల్లులు తదితరాలున్నాయి.
రాజకీయాలకు అతీతంగా ఉండాలి
రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.