తమిళనాడులో 1.18 కోట్ల మంది యువ ఓటర్లు
వారిని ప్రసన్నం చేసుకునేలా రాజకీయ పార్టీల వ్యూహాలు
ఆకర్షణకు డిజిటల్ వాగ్దానాలు
23న అసెంబ్లీ పోలింగ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జెన్‌జీ(జనరేషన్ జెడ్) నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. యువతరం తమిళ రాజకీయాల్లో పెద్దమార్పునకు పునాది కాబోతుంది. 1.18 కోట్ల మంది యువ ఓటర్లు ఉండడంతో రాజకీయ పార్టీలు వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. తమిళనాడులోని మొత్తం ఓటర్లలో సుమారు 20 శాతం అంటే 1.18 కోట్ల మంది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్‌జీ ఓటర్లే ఉన్నారు. వీరి ఓట్లు గెలుపోటములను శాసించడంలో కీలక భూమిక పోషించనున్నాయి.
జెన్ జెడ్‌ను ఆకర్షించేలా రాజకీయ పార్టీల వ్యూహాలు
జెన్–జెడ్ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలకు తమిళ రాజకీయ పార్టీలు పదునుపెట్టాయి. డీఎంకే ఆధునిక డిజిటల్ ప్రచారంలో నిమగ్నమైంది. ప్రభుత్వం కొనసాగింపు, అభివృద్ధి నినాదం ఇందులో కీలకంగా ఉంది. యువఓటర్లను ఆకర్షించే విధంగా ఉచిత ల్యాప్ టాప్‌లు, వైఫై సేవలు, ఉద్యోగకల్పన, ఉన్నతచదువుల కోసం నాన్ మొదల్వన్ పథకం ద్వారా ఉచిత వృత్తి శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణే కాకుండా, పుదుమైపెన్, తమిళ్‌పుదల్వన్ పథకాల పేరిట నెలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
అన్నాడీఎంకే విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్లను 7.5% నుంచి 10%కి పెంచుతామని, ఆర్థిక సంక్షేమ పథకాల భరోసాను కీలకంగా చేసుకుంది. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంతో యువత, అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకే విజయ్ ఈ తరం కోసం ఏఐ టెక్నాలజీ, ఫీజులమాఫీ అంటూ ముందుకు సాగుతున్నారు.
నామ్ తమిళర్ కట్చి కన్వినర్ సీమాన్ అయితే తమిళ దేశం నిర్మాణం తదితర భావోద్వేగ అంశాలతో జెన్‌జీ ఓటర్ల కోసం కీలక ప్రకటనలు చేశారు. మునుపటి తరాల మాదిరిగా ఒక పార్టీకి వంశపారంపర్య విధేయులుగా ఉండకుండా, జెన్–జీ ఓటరు తాజాగా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సమస్యల ఆధారిత ఓటింగ్
పార్టీల కంటే సమస్యలకే జెన్‌జీ ఓటర్లు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తాజా అంచనాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు, సమాచార మూలాల విశ్లేషణకు జెన్‌జీ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియా ద్వారా రాజకీయ అవగాహన పెంచుకుంటున్నారు. ఈ దృష్ట్యా యువ ఓటర్లు ఏకపక్షంగా ఉండకుండా చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి కోసం మాత్రమే కాదు. రాబోయే 20 ఏళ్ల తమిళనాడు రాజకీయ గమనాన్ని నిర్ణయించే కొత్త తరం గళం కాబోతోంది.


