సిగ్గుపడేలా విభజన

Pm Narendra Modi Slams Congress Party On Ap Bifurcation - Sakshi

రాష్ట్ర విభజనను ప్రజాస్వామిక పద్ధతిలో చేయలేదు

మైకులు ఆపేశారు.. పెప్పర్‌ స్ప్రేలు చల్లారు.. 

ఎలాంటి చర్చా జరపలేదు ఈ విధానం సరైనదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? 

అహంకారం, అధికారం మత్తులో దేశంలో వైషమ్యాలను పుట్టించారు

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనను నాటి యూపీఏ ప్రభుత్వ సారథి కాంగ్రెస్‌ ప్రజాస్వామిక పద్ధతిలో చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. సిగ్గుపడేలా రాష్ట్ర విభజన చేసిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు మోదీ మంగళవారం రాజ్యసభలో బదులిచ్చారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తీరును తూర్పారపడుతూ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ‘అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో ఆంధ్రప్రదేశే ముఖ్య భూమిక పోషించింది.

పార్లమెంటులో కాంగ్రెస్‌ అధికారం పక్షంలో కూర్చోడానికి ఏపీ అవకాశం ఇచ్చింది. అలాంటి ఏపీ విషయంలో కాంగ్రెస్‌ ఎలా వ్యవహరించింది? రాష్ట్రాన్ని ఎలా విభజించారు? మైకులు ఆపేశారు. పెప్పర్‌ స్ప్రేలు చల్లారు. ఎలాంటి చర్చా జరపలేదు. ఈ విధానం సరైనదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం?.. ’అని మోదీ నిలదీశారు. ఇలాంటి విభజనతో కాంగ్రెస్‌కు కూడా రాజకీయ లబ్ధి  ఏమీ జరగలేదన్నారు. ఆ పార్టీకిది ఇప్పటికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించారు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని అస్థిర పరిచేందుకు కాంగ్రెస్‌ నిత్యం ప్రయత్నిస్తూ వచ్చిందని మోదీ విమర్శించారు. సొంత పార్టీ సీఎంలను కూడా అవమానించిందని పేర్కొన్నారు.

‘ఉమ్మడి ఏపీలో నాటి సీఎం ఎన్టీఆర్‌ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ నేత ఎవరో అందరికీ తెలుసు. అలాగే గతంలో విమానాశ్రయంలో కాంగ్రెస్‌ సీఎం టి.అంజయ్య వైఖరి తన కుమారుడికి నచ్చలేదని ఏ ప్రధాని ఆయనను తొలగించారో కూడా సభలో చాలామందికి తెలుసు..’అని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించామని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల సంప్రదాయ పసుపును ప్రపంచ దేశాలు కరోనా సమయంలో ఎలా ఉపయోగించాయో అందరికీ తెలుసునని చెప్పారు.  

విభజనకు వ్యతిరేకం కాదు
రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదు. కానీ విభజన చేసిన తీరు ఎలాంటిది? వాజ్‌పేయి ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను సాఫీగా ఏర్పాటు చేసింది. శాంతిపూర్వకంగా, అందరితో చర్చించి ప్రక్రియ పూర్తి చేసింది. తెలంగాణ, ఏపీ విభజన కూడా అలాగే జరిగి ఉండాల్సింది. 

తెలంగాణకు విరోధులం కాము
మేం తెలంగాణకు విరోధులం కాము. అంతా కలిసి చర్చించి విభజన ప్రక్రియ చేసి ఉండాల్సిందన్నదే మా ఉద్దేశం. కానీ కాంగ్రెస్‌ అహంకారం, అధికారం మత్తు దేశంలో
ఈ విధమైన వైషమ్యాలను పుట్టించింది. ఈ వైషమ్యాల వల్ల తెలంగాణ, ఏపీలకు నష్టం జరుగుతూనే ఉంది.
– ప్రధాని మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top