
నా యాత్ర జాతి సమష్టి ఘనత
ప్రధాని మోదీతో శుభాంశు
మీ పేరులోనే శుభం దాగుంది
భూమికి అత్యంత దూరంగా
మా హృదయాలకు దగ్గరగా
మీ ప్రస్థానం యువతకు ఎనలేని స్ఫూర్తి: ప్రధాని
భారత్ మాతా కీ జై!
ఐఎస్‌ఎస్‌లో శుభాంశు నినాదం
న్యూఢిల్లీ: ‘‘అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యంలా కనువిందు చేస్తోంది’’ – మన వ్యోమగామి వాయుసేనాని, యాగ్జియం–4 మిషన్ కెప్టెన్ శుభాంశు శుక్లా (39) చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో క్రమంగా కుదురుకుంటున్న ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో లింక్ ద్వారా మాటామంతి జరిపారు. ‘‘మ్యాప్‌లో చూసే భారతావనికి, అంతరిక్షం నుంచి కనిపిస్తున్న దృశ్యానికి పోలికే లేదు.
ఇక్కడినుంచి మన దేశం చాలా పెద్దదిగా, ఎంతో గొప్పగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమి కూడా దేశాల ఎల్లలన్నవే లేకుండా ఎటునుంచి చూసినా నిండుగా, ‘వసుధైక కుటుంబం’లా కనువిందు చేస్తోంది. భూగోళమంతా మన ఇల్లుగా, అన్ని దేశాల ప్రజలందరం సమస్త మానవాళికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని మనసుకు తోస్తోంది’’ అని వివరించారు. ఐఎస్‌ఎస్‌లో కాలుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మోదీ ప్రస్తుతించారు.
‘‘మాతృభూమి నుంచి మీరు అత్యంత దూరంగా ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం ప్రతి భారతీయుని హృదయానికీ అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభముంది. అందుకు తగ్గట్టే మీ యాత్ర కూడా సరికొత్త యుగానికి శుభారంభం పలికింది. మన దేశ యువతకు కొంగొత్త ఆశలతో కూడిన కొత్త అధ్యాయానికి మీ ప్రస్థానం గొప్పగా బాటలు పరిచింది’’ అంటూ కొనియాడారు. ‘‘ఇప్పుడు మనమిలా మాట్లాడుకుంటున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయునికీ భావోద్వేగపరంగా మీతో విడదీయలేనంతటి బంధం పెనవేసుకుపోయింది.
ఆ 140 కోట్ల పై చిలుకు అవ్యక్త భావనలను, ఆకాంక్షలను వారి ప్రతినిధిగా మీకు చేరవేస్తున్నాను. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వెంట తీసుకెళ్లిన మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు. యాగ్జియం–4 మిషన్‌కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. తన ఐఎస్‌ఎస్ యాత్రను దేశ ప్రజలందరి సమష్టి ఘనతగా శుభాంశు అభివర్ణించారు.
మీ సారథ్యంలో కలలకు కొత్త రెక్కలు
‘‘రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తున్నాం. గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూమికి ప్రదక్షిణలు చేస్తున్నాం. ఈ వేగం మన దేశ ప్రగతి పరుగులకు అద్దం పడుతోంది’’ అని శుభాంశు తెలిపారు. ఐఎస్‌ఎస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ మోదీ ఆరా తీశారు. అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడుతున్నారని అడిగారు. తాను బావున్నానని శుభాంశు తెలిపారు.
కాకపోతే శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిద్రపోవడం కూడా పెను సవాలుగానే ఉందంటూ చమత్కరించారు! అన్నింటికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇలాంటి సవాళ్ల కోసమే ఏడాది పాటు కఠోర శిక్షణ పొందాం. కానీ తీరా ఇక్కడికొచ్చాక అంతా మారిపోయింది. శూన్యస్థితి కారణంగా చిన్నచిన్న విషయాలు కూడా భూమి మీదికంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇది నాకు నిజంగా సరికొత్త అనుభూతి.
‘‘అంతరిక్షంలో తరచూ తీవ్ర ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులెన్నో ఎదురవుతుంటాయి. అందుకే ఏకాగ్రత, ప్రశాంతచిత్తం చాలా అవసరం. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. శిక్షణ సందర్భంగా వీటి గురించి ఎంతో తెలుసుకున్నా. అదంతా బాగా ఉపకరిస్తోంది. భూమికి 400 కి.మీ. ఎత్తుకు చేరిన ఈ ప్రయాణం నా ఒక్కనిది కాదు. మొత్తం దేశానిది. అంతరిక్షంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎనలేని సంతోషంగా ఉన్నా.
నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మీకు, 140 కోట్ల సహచర భారతీయులకు కృతజ్ఞతలు. ఇలా ఒకనాటికి వ్యోమగామిని అవుతానని చిన్ననాడు కలలో కూడా అనుకోలేదు. మీ నాయకత్వంలో దేశం తన కలలకు కొత్త రెక్కలు తొడుక్కుంటోంది’’ అంటూ ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘‘యువతకు నేనిచ్చే సందేశమల్లా ఒక్కటే. ఆకాశమే మీ హద్దు!’’ అని పేర్కొన్నారు. సంభాషణను ముగిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ శుభాంశు చేసిన నినాదాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమంతటా ప్రతిధ్వనించాయి.
PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd
— PMO India (@PMOIndia) June 28, 2025
#WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.
PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025
అపార అనుభవంతో తిరిగి రండి
మన గ‘ఘన’ యాత్రలకు అదే పునాది
శుభాంశుకు ప్రధాని ‘హోంవర్క్’
అంతరిక్షాన్ని మరింతగా అన్వేషించాలన్న మన యువత, విద్యార్థుల సంకల్పాన్ని శుభాంశు చరిత్రాత్మక యాత్ర మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు ప్రత్యేకమైన ‘హోంవర్క్’ అప్పగించారు. ‘‘తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు వీలైనంత త్వరలో శ్రీకారం చుట్టేందుకు భారత్ ఎంతో పట్టుదలతో ఉంది.
అలాగే పూర్తి స్వదేశీ ‘భారత అంతరిక్ష కేంద్రం’ నిర్మించేందుకు, భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపేందుకు కూడా! అంతరిక్ష పరిస్థితులపై సంపూర్ణ అనుభవం గడించి విజయవంతంగా తిరిగిరండి. గగన్‌యాన్ తదితర ప్రాజెక్టులన్నింటికీ మీరు వెంటతీసుకొచ్చే వెలకట్టలేని అనుభవమే తిరుగులేని పునాది!’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. అంతరిక్షంలో భారత్ సృష్టించబోయే నూతన చరిత్రకు తన యాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని శుభాంశు బదులిచ్చారు.
క్యారెట్ హల్వా, మామిడి రసం రుచి చూపా
తనతో పాటు ఐఎస్‌ఎస్‌కు క్యారెట్ హల్వా, మామిడి రసం తీసుకొచ్చానని ప్రధానికి శుభాంశు వివరించారు. వాటిని, చవులూరించే పలు భారతీయు మిఠాయిలను ఐఎస్‌ఎస్‌లోని 10 మంది తోటి వ్యోమగాములతో శుభాంశు పంచుకున్నట్టు చెప్పారు.