
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు నుండి రాజధానిలో 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాలు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. వేడుకలలో ఢిల్లీ పౌరులకు ప్రతిరోజూ కొత్త బహుమతిని అందించనున్నామని ప్రకటించారు. ఇవి ఢిల్లీ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, వీక్షిత్ ఢిల్లీ దార్శనికతను నెరవేర్చడంలో సహాయపడతాయని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. వీటిలో 101 ఆరోగ్య నిలయాలు, 150 డయాలసిస్ కేంద్రాలు, కొత్త హాస్పిటల్ బ్లాక్‌లు, అవయవ మార్పిడి, అవగాహన పోర్టల్ ప్రారంభం మొదలైనవి ఉండనున్నాయి.
అలాగే ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రాజ్‌పుతానా రైఫిల్స్ బేస్ సమీపంలో ఫుట్ ఓవర్‌బ్రిడ్జికి పునాది వేయడం, ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థలకు శ్రీకారం, గ్రీన్ ఎనర్జీ,పరిశుభ్రత విస్తరణ ప్రణాళికలు, నంగ్లీ సక్రవతిలో బయోగ్యాస్ ప్లాంట్, ఘోఘా డైరీలో బయోగ్యాస్ ప్లాంట్, యమునా యాక్షన్ ప్లాన్ అప్‌గ్రేడ్, మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నరేలాలో కొత్త అగ్నిమాపక కేంద్రం, మండోలి జైలు సమీపంలో రూ. 65 కోట్ల గ్రిడ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ , పారిశుధ్యం, విద్య, రవాణా, పునరుత్పాదక ఇంధనం వరకు మొత్తం 75 ప్రాజెక్టులు, పథకాలను 15 రోజుల పాటు జరిగే ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రారంభించనున్నారు.