బీసీ కులాల జనాభా లెక్కలు ప్రభుత్వానికి తెలియాలి
సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆ గణాంకాలు అవసరం
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం
కుల గణనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జన గణనతోపాటు కుల గణన చేపట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పింది. సంక్షేమ పథకాలను రూపొందించి, అమలు చేయాలంటే వెనుకబడిన కులాల జనాభా లెక్కలు ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియాలని పేర్కొంది. కుల గణనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుల గణన అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తుచేసింది.
సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుధాకర్ గుమ్ముల స్వయంగా హాజరై తన తరఫున తానే వాదనలు వినిపించారు. కులాల లెక్కలపై ప్రభుత్వం వద్ద ఇప్పటికే పుష్కలమైన సమాచారం ఉందని, గణాంకాలు అందుబాటులో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరోసారి కుల గణన అవసరం లేదని చెప్పారు. పిటిషనర్ వాదనను ధర్మాసనం తిరస్కరించింది.
‘‘జనాభా లెక్కల సేకరణతోపాటు కుల గణన కూడా జరగాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇందులో తప్పేముంది? వెనుకబడిన తరగతి ప్రజలు ఎంతమంది ఉన్నారో, వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి తప్పక తెలిసి ఉండాలి’’అని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. న్యాయస్థానాల పరిధికి మించిన అంశం కావడంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలియజేసింది.


