మున్నార్: 'ఆపరేషన్ నుంఖోర్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. భూటాన్ నుంచి అక్రమంగా వాహనాలను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలపై విచారణలో భాగంగా భూటాన్ కస్టమ్స్ ప్రతినిధుల బృందం కేరళకు చేరుకుంది. భూటాన్ కస్టమ్స్ కమిషనర్ నేతృత్వంలోని 10 మంది బృందం.. మున్నార్‌లో భారత కస్టమ్స్ అధికారులతో సమావేశమైంది. సరిహద్దు కార్ల అక్రమ రవాణాపై భూటాన్ కస్టమ్స్ బృందం దృష్టి పెట్టింది.
కాగా, భారీ వాహనాల స్మగ్లింగ్ ముఠాను ‘ఆపరేషన్ నుంఖోర్’ గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో భారీ పన్ను ఎగవేత రాకెట్ ఇటీవల బయటపడింది. దీని ద్వారా సుమారు 15,849 లగ్జరీ కార్లను ఎటువంటి కస్టమ్ డ్యూటీ (పన్నులు) చెల్లించకుండా భూటాన్ నుండి భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు తేలింది. భూటానీ భాషలో 'నుంఖోర్' అంటే 'వాహనం' అని అర్థం.
ఈ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సినీ పరిశ్రమకు కూడా పాకింది, ముఖ్యంగా పలువురు ప్రముఖ నటుల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. కేరళలో 35-40 లగ్జరీ కార్లపై జరిగిన ప్రాథమిక విచారణతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నేషనల్ వెహికల్ రిజిస్ట్రీని డిజిటల్ ఆడిట్ చేయగా.. నకిలీ పత్రాలు, సర్టిఫికేట్లు సృష్టించినట్లు తేలింది. ఈ వాహనాలను రాయబార కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలకు చెందినవంటూ నమ్మించేలా హై-క్వాలిటీ నకిలీ డాక్యుమెంట్లను తయారు చేశారు.
భూటాన్‌తో సరిహద్దులు ఈశాన్య రాష్ట్రాల గుండా లగ్జరీ కార్లను భారత్‌లోకి తెచ్చారు. భారీ కస్టమ్ డ్యూటీని తప్పించుకోవడానికి వీటిని హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించారు. కేవలం అస్సాంలోనే ఇలాంటి 464 వాహనాలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. కేరళలో ఇప్పటివరకు 50కి పైగా వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ రాకెట్ వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి.. తప్పుడు మార్గాల్లో వీరు లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ నటీనటులు ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
భారత్-భూటాన్ సరిహద్దు నిర్వహణ సదస్సు 20వ తేదీన (సోమవారం) మున్నార్‌లో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 'ఆపరేషన్ నమ్‌ఖోర్'పై కీలక విషయాలు వెల్లడించే అవకాశముంది. CBIC స్పెషల్ సెక్రటరీ యోగేంద్ర గార్గ్, భూటాన్ ప్రతినిధి సోనమ్ జామ్త్సో అధ్యక్షత వహించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి కఠినమైన భద్రతా చర్యలు, సరిహద్దు తనిఖీలను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం 'ఆపరేషన్ నుంఖోర్' దేశవ్యాప్తంగా విస్తరించింది. కస్టమ్స్ మరియు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విచారణలో మరికొందరి ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.
ఇటీవల కస్టమ్స్ అధికారులు 'ఆపరేషన్ నుంఖోర్' పేరుతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పన్ను ఎగవేసి, నకిలీ పత్రాలతో దేశంలోకి దిగుమతి అవుతున్న విదేశీ వాహనాలను టార్గెట్‌గా చేసుకుని కేరళలోని 35 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆఫరేషన్‌లో మొత్తం 38 విలాసవంతమైన కార్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకలక్కల్ చెందిన వాహనాలు కూడా ఉండటం గమనార్హం.


