సతారా: మహారాష్ట్రలోని సతారాలో చోటు చేసుకున్న యువ వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, చేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు ఎలా చనిపోయిందో అదే తరహాలో నిందితులిద్దరికీ శిక్ష పడాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన కన్నీటి వ్యథను మీడియా ద్వారా తీసుకెళ్లారు. ‘ నా కూతురు ఎలా అయితే చనిపోయిందో అదే రకంగా వారికి ఉరిశిక్ష పడేలా చేయండి సీఎం సార్, అంతకు మించి నాకు ఇక వేరే న్యాయం ఏమీ అక్కర్లేదు. ఇదే నా డిమాండ్’ అంటూ గద్దగద స్వరంతో విన్నవించాడు
‘ నా కూతుర్ని కాపాడటానికి ఎవరూ రాలేదు. అన్యాయం జరుగుతుంటే, అందరూ నిలబడి చూస్తున్నారు. అక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఉన్నారు, కానీ ఒక్క కృష్ణుడు కూడా నా కూతురికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి, భవిష్యత్తులో కూతుళ్ల కోసం, కనీసం ఒక కృష్ణుడు ముందుకు వచ్చి ‘ఆమె’ గౌరవాన్ని కాపాడాలి’ అని కన్నీటి పర్యంతమయ్యాడు.
కాగా, మహారాష్ట్రలో ఓ సన్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్హన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది.
తాను నివాసం ఉం టున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచా రం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


