చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్‌ | NewsClick Founder Prabir Purkayastha, HR Head Sent 7-Day Police Custody | Sakshi
Sakshi News home page

చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్‌

Oct 4 2023 10:56 AM | Updated on Oct 4 2023 11:06 AM

NewsClick Founder Prabir Purkayastha Sent 7 Day Police Custody - Sakshi

ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్‌ విధించింది. న్యూస్‌క్లిక్‌ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను  కూడా ప్రశ్నించారు.

న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్‌లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్‌క్లీక్‌తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్‌తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

చైనా నిధులు..
న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. 

భారీగా విదేశీ నిధులు
న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్‌ వచ్చినట్లు  గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది.

ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement