
ఏఐతో రూపొందినట్టు వెల్లడించాలి
ఏఐ కంటెంట్‌కు త్వరలో కొత్త రూల్స్
కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు
ప్రతిపాదించిన పార్లమెంటరీ కమిటీ
డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించే ఈ కంటెంట్ విషయంలో మన దేశం కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీడియోలను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తోపాటు.. వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వెల్లడించే లేబులింగ్ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్
కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి.. లోక్‌సభ సభ్యుడు నిషికాంత్ దూబే నేతృత్వంలో ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, విచారించడానికి కఠినమైన సాంకేతిక, చట్టపరమైన నియ మాలను అమలు చేయాలని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే.. భారత్‌లో కంటెంట్ క్రియేటర్స్ ఏఐని ఉపయోగించే విధా నం పెద్ద ఎత్తున మారుతుందని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నది నిపుణుల మాట.
బాధ్యులను పట్టుకోవచ్చు
ఏఐతో రూపొందిన తప్పుడు సమాచారం విషయంలో శిక్షా నిబంధనలను సవరించాలని, జరిమానాలను పెంచాలని కమిటీ తన నివేదికలో కోరింది. ‘ఏఐతో అభివృద్ధి చేసినట్టు తెలిపే సమాచారంతో వీడియోలు, చిత్రాలు, ఇతర అంశాలను ప్రజలు సులభంగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను సులభంగా పట్టుకోవచ్చు’ అని కమిటీ తెలిపింది.
మీడియాకు విన్నపం
నకిలీ వార్తలను కట్టడి చేసేందుకు బలమైన అంతర్గత రక్షణ చర్యలను చేపట్టాలని మీడియా సంస్థలను కూడా పార్లమెంటరీ కమిటీ కోరింది. సమాచారం నిజమేనా కాదా అన్నది తెలుసుకునే కఠిన తనిఖీ వ్యవస్థ, వార్తా ప్రసారంలో నాణ్యత, కచ్చితత్వం ప్రమాణాలను కాపాడే అంబుడ్స్‌మన్ ను నియమించాలని సూచించింది. మోసపూరిత కంటెంట్ సులభంగా వైరల్ అయ్యే యుగంలో ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలాంటి చర్యలు చాలా అవసరమని అభిప్రాయపడింది.
ఇప్పటికే కొన్ని..
డీప్‌ఫేక్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నకిలీ ప్రసంగాలను అడ్డుకోగల; డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలను గుర్తించగల సాధనాలను అభివృద్ధి చేయడానికి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.
నమ్మదగినవిగా మారతాయి
కంటెంట్ అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపాదిత నిబంధనలు.. క్రియేటర్లను అడ్డుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదనీ, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. క్రియేటర్లు చేయాల్సిందల్లా తమ వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వీక్షకులకు కనిపించేలా వెల్లడించాలి.
ఏఐతో రూపొందిన కంటెంట్‌తో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే, పెట్టుబడి పెట్టే సృష్టికర్తలు, కంపెనీలను అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందరికీ మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయి.
10 కోట్లకు పైగా చానళ్లు
భారత్‌లో 10 కోట్లకు పైచిలుకు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో 7 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు.
రోజూ కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తుంటారు. ఇంతటి విశాలమైన సామాజిక మాధ్యమాల ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయం అన్నది నిపుణుల మాట. భారత్‌లో కట్టడి చేస్తాం సరే.. అంతర్జాతీయంగా వచ్చి పడే కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తారన్నది ముందున్న సవాల్.
» సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘చిత్ర నిర్మాణంలో జంతువులకు, పక్షులకు ఎలాంటి హానీ చేయలేదని, గ్రాఫిక్స్ ఉపయోగించాం’ అని ఓ ప్రకటన ఇస్తారు. అదే తరహాలో ఇప్పుడు.. కంటెంట్ ఏఐతో సృష్టించినట్టు వెల్లడించాల్సి ఉంటుంది.
» ఏఐతో కంటెంట్ సృష్టించినట్టుగా వెల్లడించాలన్న తప్పనిసరి నిబంధన చైనాలో ఉంది.
» యూరోపియన్ యూనియన్ గతేడాది ఏఐ యాక్ట్‌ను అందుబాటులోకి తెచ్చి దశలవారీగా అమలు చేస్తోంది.