
పదవీ విరమణకు పరిమితి విధించలేదు
అలాంటి నిబంధన ఆర్‌ఎస్‌ఎస్‌లో లేదు
సంఘ్ ఆదేశించినంత కాలం పని చేస్తూనే ఉంటాం
బీజేపీ–సంఘ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు
బీజేపీకి కేవలం సలహాలు మాత్రమే ఇస్తాం
నిర్ణయాలు ఈ పార్టీ నేతలే తీసుకుంటారు
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టికరణ
న్యూఢిల్లీ: పదవుల నుంచి దిగిపోవడానికి 75 ఏళ్ల నిబంధన తమ సంస్థలో లేదని రాష్ట్రయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టంచేశారు. 75 ఏళ్ల వయసు వచ్చినవారు పదవుల నుంచి కచ్చితంగా తప్పుకోవాలని తాను ఏనాడూ చెప్పలేదని అన్నారు. తద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పదవీ విరమణపై జరుగుతున్న చర్చకు తెరదించారు. సంఘ్‌లో తామంతా స్వచ్ఛంద సేవకులమని భగవత్ చెప్పారు. సంఘ్ పెద్దలు చెప్పింది చేస్తామని, పని చేయడానికి వయసుతో నిమిత్తం లేదని వ్యాఖ్యానించారు. అప్పగించిన పనిని తిరస్కరించడానికి వయసును సాకుగా చూపే అలవాటు తమకు లేదన్నారు.
ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పగించిన పని చేస్తామన్నారు. తనకు 80 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ‘శాఖ’కు వెళ్లి పనిచేయాలని ఆదేశిస్తే తప్పకుండా ఆ పని పూర్తి చేస్తానని ఉద్ఘాటించారు. త్వరలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులతో మోహన్ భగవత్ సమావేశమయ్యారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో మూడు రోజులపాటు ఈ భేటీలు జరిగాయి. గురువారం మీడియాతో భగవత్ మాట్లాడారు. తాను గానీ, మరొకరు గానీ పదవీ విరమణ చేయాల్సిందేనని తాను ఆదేశించలేదని వ్యాఖ్యానించారు. జీవితంలో ఏ సమయంలో రిటైర్ కావడానిౖMðనా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సంఘ్ ఆదేశించినంత కాలం పని చేస్తూనే ఉంటామన్నారు.
మరో ఉద్యమ ఆలోచన లేదు
కాశీ, మథుర కోసం అయోధ్య తరహాలో ఉద్యమం నడిపే ఆలోచన లేదనిమోహన్ భగవత్ వెల్లడించారు. అయోధ్యలో రామాలయం కోసం ఉద్యమించామని, అనుకున్న లక్ష్యం సాధించామని తెలిపారు. మరో ఉద్యమంలో పాల్గొనబోమని పేర్కొన్నారు. కాశీ, మథుర, అయోధ్య హిందువులకు పవిత్రమైన క్షేత్రాలని చెప్పారు. కాశీ, మథుర ఉద్యమం కోసం ఎవరైనా సాయం కోరితే తమ కార్యకర్తలు ముందుకొస్తారని సూచించారు. ప్రతిచోటా ఆలయం కోసం శోధించాల్సిన అవసరం లేదన్నారు. కాశీ, మథురను హిందువులు దక్కించుకుంటే అది మంచి పరిణామం అవుతుందన్నారు.
అఖండ భారత్...
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సంఘ్ చురుగ్గా పాల్గొన్నదని, దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిందని మోహన్ భగవత్ తేల్చిచెప్పారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో దేశమంతా గాందీజీ వెనుక నడిచిందని, దేశ విభజనను అడ్డుకోవడానికి ఆ సమయంలో సంఘ్‌కు ఉన్న బలమెంత? అని ప్రశ్నించారు. అఖండ భారత్ అనేది ‘మార్పులేని సత్యం’ అని చెప్పారు. రాజకీయ అంశంగానే దీన్ని మదిలో పెట్టుకోవాలన్నారు.
మతం వ్యక్తిగత విశ్వాసం
బీజేపీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆర్‌ఎస్‌ఎస్ తీసుకుంటోందన్న విమర్శలను మోహన్ భగవత్ కొట్టిపారేశారు. తాము కేవలం సూచనలు ఇస్తుంటామని, నిర్ణయాలు బీజేపీ నేతలే తీసుకుంటారని తేల్చిచెప్పారు. బీజేపీతో సంఘ్‌కు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ‘శాఖలు’ నడిపించడం తమ విధి అని, ప్రభుత్వాలను నడిపించడం బీజేపీ బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు. మతం ఆధారంగా ఇతరులపై దాడి చేయడాన్ని సంఘ్ సమర్థించబోదని పేర్కొన్నారు. దేశంలో ఇస్లాం మతం ఉండకూడదని హిందూ ఆలోచనావిధానం చెప్పడం లేదన్నారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని, దాని వెనుక ప్రలోభం గానీ, బలవంతం గానీ ఉండకూడదని సూచించారు. ఇస్లాం మతానికి మన దేశంలో ఎప్పటికీ స్థానం ఉంటుందన్నారు.
కనీసం ముగ్గుర్ని కనండి
భారతీయులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని భగవత్ విజ్ఙప్తిచేశారు. సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న సమాజాలు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. పరిమితంగా ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు జనా భా స్థిరీకరణ కోసం ముగ్గురు సంతానంతో సరిపెట్టుకోవాలని విన్నవించారు. ఆంగ్ల భాషకు సంఘ్ వ్యతిరేకం కాదన్నారు. భారతీయులు మాతృభాషతో పాటు కనీసం మూడు భాషలు నేర్చుకోవాలని సూచించారు. దేశమంతటా అందరినీ అనుసంధానించే భాష ఒకటి ఉండాలన్నారు. ఆది ఆంగ్ల భాష కాకూడదని చెప్పారు. అనుసంధాన భాషపై ప్రజలంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలన్నారు. భారత్‌ను, ఇక్కడి సంప్రదాయాలను చక్కగా అర్థం చేసుకోవడానికి సంస్కృత భాష దోహదపడుతుందని వివరించారు.