
ఈరోజు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే 75 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ ఏం తింటుంటారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. కాగా ప్రధాని మోదీ రాబోయే నవరాత్రి రోజుల్లో కఠినమైన ఉపవాస దీక్షను అనుసరిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకుండా, గోరువెచ్చని నీటిని మాత్రమే తాగుతారు.
ఈ ఏడాది మొదట్లో లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ తన దినచర్యను తెలిపారు. ఉపవాసంతో తనకు కలిగిన అనుభవాలను ఆయన వివరించారు. ఆహారం మానేయడం, ఎక్కువసేపు నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల ఇంద్రియ జ్ఞానం ఏ విధంగా పెరుగుతుందో ప్రధాని తెలియజెప్పారు. ఉపవాసం అందించే మానసిక స్పష్టత, పదునుపెట్లే ఆలోచన ప్రక్రియలను ఆయన వివరించారు. ఉపవాసం అనేది వినూత్న ఆలోచనలతోపాటు ప్రత్యేకమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందని అన్నారు.
ఉపవాసం అంటే కేవలం ఒక క్రమశిక్షణ మాత్రమే కాదని, అది పంచేంద్రియాలను మరింత చురుకుగా మారుస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉపవాసం చేసే సమయంలో మన ఇంద్రియాలైన వాసన, స్పర్శ, రుచి వంటివి చాలా సున్నితంగా మారతాయి. అప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ అనుభవంలోని రాని వాసనను అనుభవించగలుగుతారు. ఒకరు టీ కప్పుతో వెళ్తున్నా దాని సువాసనను పసిగట్టగలుగుమని ప్రధాని మోదీ తెలిపారు.
ఉపవాసం వల్ల ఆలోచనల్లో స్పష్టత, కొత్తదనం వస్తుందని, అది వినూత్నంగా ఆలోచించడానికి, భిన్నమైన కోణంలో విషయాలను చూడటానికి సహాయపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. సంవత్సరమంతా పలు రకాల ఉపవాస దీక్షలను మోదీ పాటిస్తారు.
పురాతన భారతీయుల సంప్రదాయమైన 'చాతుర్మాస దీక్ష' ను ప్రధాని మోదీ పాటిస్తారు. మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే కాలంగా దీనిని భావిస్తారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో తాను 24 గంటల్లో ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటానని మోదీ తెలిపారు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుందని, అందుకే ఈ పద్ధతి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తారన్నారు. ప్రధాని మోదీ సంవత్సరానికి రెండు సార్లు వచ్చే నవరాత్రులను చాలా కఠినంగా పాటిస్తారు.
ఈ తొమ్మిది రోజులలో రోజుకు ఒకసారి, అదికూడా ఒకే రకం పండును మాత్రమే తింటానని మోదీ తెలిపారు. ఒకవేళ తాను బొప్పాయిని ఎంచుకుంటే, ఆ తొమ్మిది రోజులు బొప్పాయి తప్ప మరేమీ ముట్టుకోనని మోదీ తెలిపారు. శారదా నవరాత్రులలో ప్రధాని మోదీ పూర్తిగా ఆహారాన్ని నిలిపివేసి, 9 రోజుల పాటు కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతారు. వేడి నీళ్లు తాగడం తన దినచర్యలో ఎప్పటి నుంచో భాగమని, కాలక్రమేణా తన జీవనశైలి కి అది అలవాటు అయిపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.