ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి

Mumbai: Patient Bitten By Rat In ICU Ward - Sakshi

బాధితుడి కన్నుకు గాయాలు 

ఘాట్కోపర్‌లోని రాజావాడీ ఆస్పత్రిలో ఘటన

సాక్షి, ముంబై: ఘాట్కోపర్‌లో బీఎంసీకి చెందిన రాజావాడి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఎలుకలు దాడిచేశాయి. ఘటనలో బాధితుడి కన్నుకు గాయం అయినట్లు తెలిసింది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ పరిపాలన విభాగం దర్యాప్తునకు ఆదేశించినట్లు మేయర్‌ కిశోరీ పేడ్నేకర్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సాధారణంగా ప్రభుత్వ లేదా కార్పొరేషన్‌ ఆస్పత్రుల్లో జనరల్‌ వార్డులో ఎలుకలు, పిల్లులు, కుక్కలు అటు, ఇటూ తిరుగుతుంటాయి. కానీ, ఐసీయూలో ఏకంగా ఎలుక దూరడం, ఆ తరువాత బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి కన్ను కొరకడం ఆస్పత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

నిద్రలో ఉండగా.. 
కుర్లా, కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలుండటంతో ఐసీయూలో చేర్పించి వైద్యం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐసీయూలోకి వచ్చిన బంధువులు శ్రీనివాస్‌ కంటి నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు గమనించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు పరీక్షించారు. రోగి నిద్రలో ఉండగా ఎలుకలు కన్ను కొరికినట్లు నిర్ధరణకు వచ్చారు. అదృష్టవశాత్తు కన్నుగా ఎక్కువగా గాయం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న కిశోరి పేడ్నేకర్‌ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఇదిలాఉండగా నాలుగేళ్ల కిందట కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కాటేశాయి. ఆ తరువాత మార్చురిలో ఉన్న శవాలను గుర్తుపట్టలేనంతగా ఎలుకలు కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top