
ముంబై: మహానగరం ముంబైలో సోమవారం ఉదయం మోనోరైలు కాసేపు ప్రయాణికులను భయపెట్టింది. వడాలా ప్రాంతంలో మోనోరైలు రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మోనో రైలు నిలిచిపోయిందని అధికారులు నిర్ధారించారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం మోనోరైలు సాంకేతిక లోపంతో ఆగిపోయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు తీసుకువచ్చి, చెంబూర్ నుండి వచ్చిన మరొక మోనోరైలులో వారిని సురక్షితంగా తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక దళం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మోనోరైలును కప్లింగ్ ద్వారా అక్కడి నుంచి తొలగించనున్నారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) తెలిపిన వివరాల ప్రకారం మోనో రైలు ఆగిన సమయంలో దానిలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. గత నెలలో నగరంలోని ఆచార్య అత్రే చౌక్ స్టేషన్‌లో ఒక మోనోరైలు రైలు 12 నిమిషాల పాటు నిలిచిపోయింది. ముంబైలో మోనోరైల్ సేవలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మోనోరైలు ముంబైలోని వడాలా నుండి ఛంబూర్, సంత్ గాడ్గే మహారాజ్ చౌక్ వరకు నడుస్తుంది.