ఓటమెరుగని నేత.. అయినా ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు

Mulayam Singh Not Survive In National Politics - Sakshi

ఢిల్లీ: ప్రాంతీయ పార్టీ ద్వారా జాతీయ నేతగా ఎదిగిన ములాయం సింగ్‌ యాదవ్‌కు.. అభిమాన గణం ఎక్కువే. పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఈ రాజకీయ దిగ్గజం.. ఎన్నికల్లో ఓటమి ఎరుగని యోధుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయంకు ఒక్కగానొక్క కోరిక మాత్రం తీరలేదు.  

యూపీ రాజకీయాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో చక్రం తిప్పిన ములాయం.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే ఆ రాజకీయాల్లో ప్రముఖంగా రాణించడం మాత్రం ఎందుకనో ఆయన వల్ల కాలేకపోయింది. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా, రక్షణ మంత్రిగా పేరు దక్కినప్పటికీ.. అంతకు మించి ముందుకు వెళ్లడం ఆయన వల్ల కాలేదు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు దక్కినప్పటికీ.. అప్పటికే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పార్టీల హవా ముందు ఆయన పాచికలు పారలేకపోయాయి. అంతెందుకు.. 
 
మూడో దఫా ముఖ్యమంత్రి అయిన టైంలోనూ.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి మెయిన్‌పురి నుంచి ఎంపీగా నెగ్గారు. అయితే.. అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కమ్యూనిస్ట్‌ పార్టీ మద్దతుతో అధికారం కొనసాగించింది. దీంతో ములాయం, సమాజ్‌వాదీ పార్టీకి కేంద్రంలో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలకు మళ్లి.. యూపీ సీఎంగానే కొనసాగారాయన. 2007 ఎన్నికల్లో బీఎస్పీ చేతిలో ఓటమి పాలయ్యేదాకా ఆయన సీఎంగా కొనసాగారు. 

ఆపై తనయుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్నప్పటికీ.. ఎస్పీ వర్గపోరు, ఆపై అనారోగ్యం తదితర కారణాలతో ఆయన జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయారు. అయితే.. ములాయం సింగ్ యాదవ్ తన తరం రాజకీయ నాయకులలో తన విలువలను చెక్కుచెదరకుండా, తన రాజకీయాలను కార్పొరేట్‌ పరం కాకుండా కాపాడుకుంటూ వచ్చిన నేతనే చెప్పొచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top