ఎమర్జెన్సీ వార్డ్‌లో రక్తపు మడుగులో పేషెంట్‌.. చుట్టూ తిరుగుతున్న కుక్క.. ఏం జరిగింది?

Man Covered In Blood Lying On Floor Of emergency Ward UP Hospital - Sakshi

లఖ్‌నవూ: ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు. అతని చుట్టూ ఓ వీధి కుక్క తిరుగుతున్న హృదయవిదారక సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగింది.

వీడియో ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో కింద పడిపోయి ఉన్నాడు. చుట్టూ రక్తం పడి ఉంది. ఆ వ్యక్తి ముఖం, తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి చుట్టూ ఓ వీధి కుక్క సైతం తిరుగుతోంది. 28 సెకన్ల పాటు చూపించిన ఈ వీడియోలో ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ పడకల సహా ఏ ఒక్క డాక్టర్‌, నర్సు సైతం లేరు. 

మరోవైపు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆసుపత్రి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఎస్‌కే వర్మ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, చికిత్స అందిస్తున్న సమయంలోనే పలుమార్లు బెడ్‌ పైనుంచి కిందపడిపోయినట్లు చెప్పారు. ఆ వీడియో తీసిన సమయంలో డాక్టర్‌, వార్డు బాయ్‌ మరో వార్డులోని ఎమర్జెన్సీ కేసును చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తిని గోరఖ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ‘ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top