ఎంపీ నవనీత్‌ కౌర్‌కు భారీ షాక్‌.. 2 లక్షల జరిమానా

Maharashtra MP Navneet Kaur Rana Fined Rs 2 Lakh For Fake Caste Papers - Sakshi

నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌పై పోటీ చేసి గెలిచినట్లు ఆరోపణలు

సర్టిఫికేట్‌ రద్దుతో పాటు జరిమానా విధించిన బాంబే హైకోర్టు

ముంబై: మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణాకు బాంబే హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆమె క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్‌ కౌర్‌.. తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్‌సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది. 

శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పార్లమెంట్ లాబీల్లో తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ మార్చిలో నవనీత్ కౌర్‌ గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని అరవింద్‌ సావంత్‌ తనను హెచ్చరించారని తెలిపారు. తనపై యాసిడ్‌ దాడి చేస్తామంటూ ఫోన్‌ కాల్స్‌తో పాటు శివసేన లెటర్‌ హెడ్‌తో లేఖలు కూడా వస్తున్నాయంటూ నవనీత్‌ కౌర్‌.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 

2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్‌ పైనే విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్‌కౌర్‌.. ఎన్సీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవనీత్‌ కౌర్‌ పలు తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top