ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ

Lunar Eclipse 2022 Two Groups Clash Over Biryani Festival Odisha - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: దేశవ్యాప్తంగా మంగళవారం చంద్రగ్రహణం కనువిందుచేసింది. ఇటానగర్‌, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. కోల్‌కతా, భువనేశ్వర్‌, ఢిల్లీ, శ్రీనగర్‌, చెన్నై, గాంధీ నగర్‌, ముంబై, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. కొందరు అనాదిగా వస్తున్న కొన్ని ఆచారాలను పాటించగా, మరికొందరు వాటిని లైట్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో రెండో చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

రాజధాని భువనేశ్వర్‌లోని లోహియా అకాడెమీలో హేతువాద వర్గం నేడు (చంద్రగ్రహణం) బిర్యానీ ఫెస్టివల్‌ నిర్వహించింది. విషయం తెలుసుకున్న​ సంప్రదాయవాదులు అక్కడకు చేరుకుని చంద్రగ్రహణం రోజున వండిపెట్టిన ఆహారాన్ని తినడమేంటని అభ్యంతరం తెలిపారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో బిర్యానీ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నవారిపై సంప్రదాయవాదలు దాడికి పాల్పడ్డారు. హేతువాదులపై ఆవుపేడ, రాళ్లతో దాడి చేశారు.
(చదవండి: Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం)

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాఠీలకు పనిచెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెర్హాంపూర్‌లోనూ ఇలాంటి వెలుగుచూసింది. బిర్యానీ ఫెస్టివల్‌ నిర్వహణను సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది.

సంప్రదాయవాదులు అంటున్నట్టుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని స్వీకరిస్తే చెడు ప్రభావాలేమీ ఉండవని హేతువాదులు చెప్తున్నారు. అర్థంలేని ఆచారాలను పాటించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి సూర్యగ్రహణం రోజున కూడా భువనేశ్వర్‌లో సంప్రదాయవాదులు, హేతువాదుల మధ్య బిర్యానీ పంచాయితీ వివాదానికి దారితీసింది.
(చదవండి: చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top