చూడలేదు.. వినబడదు.. 12వ తరగతిలో 98% మార్కులు
లక్నో: చిన్న చిన్న శారీరక లోపాలకే జీవితం అయిపోయిందనుకునేవారు అనేకం. చిన్న ఓటమితోనే జీవితాన్ని చాలించేవాళ్లనీ చూస్తున్నాం. కానీ, ఈ యూపీ యువతి అందుకు విభిన్నం. పరీక్షలను కేవలం తన ప్రతిభకు కొలమానంగా చూడలేదు. తన సంకల్ప బలం ఎంత గొప్పదో సమాజానికి చెప్పాలనుకుంది. ఇటీవల విడుదలైన 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. లక్నోలోని క్రైస్ట్ చర్చ్ కాలేజీ టాపర్‌గా నిలిచింది.
పదో తరగతిలోనూ ప్రతిభ..
లక్నోకు చెందిన సారా మోయిన్ పుట్టుకతోనే అంధురాలు. మూడో తరగతిలో ఉండగా అరుదైన వ్యాధి సార్కోయిడోసిస్ సోకడంతో ఆమె వినికిడి శక్తి కోల్పోయింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా ఫలితం లేదు. ఆమెలోని లోపాల వల్ల 2014లో ఆమెను చేర్చుకోవడానికి నగరంలోని పలు పాఠశాలలు నిరాకరించాయి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. కూతురుకు బాసటగా నిలవడానికి తండ్రి మోయిన్ ఇద్రిసీ ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె త్లలి జూలీ హమీద్.. సారాకు అండగా నిలిచారు. 2024లో ఐసీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల్లోనూ 95శాతం మార్కులు సాధించింది.
అరచేతిపై అక్షరాలు అర్థం చేసుకుని..
ఆ ఫలితం ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. తండ్రి ఆమెను క్రిస్ట్ చర్చ్ కాలేజీలో చేర్పించారు. ప్రిన్సిపల్ రాకేస్ చత్రీ, ఉపాధ్యాయుడు సల్మాన్ అలీ ఖాజీ ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించారు. అప్పటికే ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతి గదిలో ఆయన బోధిస్తున్నారు. అయితే, ఆ విద్యార్థుల్లో రెండు వైకల్యాలున్న ఏకైక విద్యారి్థని సారా. బ్రెయిలీ కీబోర్డుతో కూడిన ల్యాప్‌టాప్‌ను పోలిన ఆర్బిట్ రీడర్ పరికరాన్ని ఉపయోగించి ఆమెకు బోధించారు. ఈ ప్రయాణం అంత సులభమేమీ కాదు. పుస్తకాల్లోని మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి వర్డ్ ఫైల్స్‌గా మార్చాల్సి వచ్చేది.
వాటిని ఆర్బిట్ రీడర్‌కు అనుసంధానించి, బ్రెయిలీ కీబోర్డుపై వేళ్లు పెట్టి ఆమె చదవగలిగేది. పునశ్చరణకోసం తల్లి సారా అరచేతిపై అక్షరాలను గీస్తూ ప్రశి్నస్తే.. ఆమె వాటిని వాక్యాలుగా మార్చుకుని సమాధానాలు ఇచ్చేది. స్కూల్లో సల్మాన్ సార్ ఆమెకు బోధిస్తే.. ఇంట్లో తల్లి, తండ్రి ఆమెకు చేయూతనిచ్చారు. తనకున్న ప్రతికూలతలను అధిగమించి అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోరు, తనకు నచ్చిన ఐదు సబ్జెక్టుల్లో 98.2 శాతం మార్కులు సాధించింది. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ముద్దుగా ‘హెలెన్ కెల్లర్’అని పిలుచుకునే సారా కాలేజీ టాపర్‌గా నిలిచింది.
ఐఏఎస్ కావాలని..
సారా.. ఐఏఎస్ అధికారి కావాలని, దివ్యాంగ పిల్లలకోసం పనిచేయాలనే సంకల్పంతో ఉందని ఆమె తండ్రి మోయిన్ తెలిపారు. సారా వంటి అభ్యర్థులు పరీక్షల్లో సహాయకుల(స్క్రైబ్స్)పై ఆధారపడకుండా, ల్యాప్‌టాప్‌లు, బ్రెయిలీ డిస్‌ప్లేల వంటి సహాయక పరికరాలను ఉపయోగించుకోవడానికి పరీక్షా సంస్థలు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి పిల్లలు తమను తాము వ్యక్తపరచుకోవడానికి సాధనాలు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు.


