
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో దాండియా ఆటలు, గర్బా నృత్యాలు ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేలా చూసుకోవాలని వేడకల నిర్వాహకులకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఉత్సవాల్లో పాల్గొనేవారంతా నుదుటన కస్తూరి తిలకం ధరించాలని, పవిత్ర దారం(రక్షాసూత్రం) కట్టుకుని పూజల్లో పాల్గొనాలని కోరింది.
రానున్న దసరా వేడుకలను పురస్కరించుకుని నాగపూర్‌లోని విశ్వహిందూ పరిషద్, విదర్భ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ తిత్రే మీడియాతో మాట్లాడారు. దేశంలో సోమవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే శరన్నవరాత్రులను వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సభ్యులు పర్యవేక్షిస్తారని, ప్రతీచోటా హిందూ మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అనేది చూస్తారని తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనేవారిపై తాము గో మూత్రం జల్లుతామని అన్నారు. హిందూ సంప్రదాయ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ‘లవ్ జిహాద్’ కేసులను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రతీయేటా నవరాత్రి వేడుకల సమయంలో లవ్ జిహాద్ ఉదంతాలు కనిపిస్తున్నాయన్నారు. మతమార్పిడికి కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
గర్బా అనేది కేవలం నృత్యం కాదని, దేవతను ప్రసన్నం చేసుకునేందుకు ఆచరించే ఒక ఆరాధన అని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ పేర్కొన్నారు. హిందూ ఆచారాలపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే ఇటువంటి నృత్యాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూ, సమాజాన్ని విభజిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని అయినా, హిందూ పరిరక్షణకు ఈ మార్గదర్శకాలు అవసరమని బీజేపీ సీనియర్ నేత చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. గర్బా అనేది హిందువులకు సంబంధించిన వేడుక అని ఇతర మతాల వారు దీనిలో జోక్యం చేసుకోకూడదని మహారాష్ట్ర బీజేపీ మీడియా హెడ్ నవనాథ్ బాన్ అన్నారు.