'గింజ' నుంచి మరింత గుంజేలా.. | Latest research by IRRI scientists doubles iron and zinc absorption in rice | Sakshi
Sakshi News home page

'గింజ' నుంచి మరింత గుంజేలా..

Apr 9 2026 4:16 AM | Updated on Apr 9 2026 4:16 AM

Latest research by IRRI scientists doubles iron and zinc absorption in rice

బియ్యంలోఇనుము, జింక్‌శోషణను రెట్టింపు చేసిన ఐఆర్‌ఆర్‌ఐశాస్త్రవేత్తల తాజాపరిశోధన 

పంట గింజ పోసుకునే దశలోఓ రసాయనం పిచికారీతోసమస్యకు చెక్‌ 

ఇది మొక్కజొన్నతదితర పంటల్లోనూ సమర్థంగా పనిచేస్తుందన్న శాస్త్రవేత్తలు 

సాక్షి, స్పెషల్‌ డెస్క్ :  వరి, గోధుమ వంటి ధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకునే వారిలో ఇనుము, జింక్‌ వంటి సూక్ష్మపోషకాల లోపాలు కనిపిస్తున్నాయి. తగినన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నా, సూక్ష్మ పోషక లోపంతో బాధపడటాన్నే ‘హిడెన్‌ హంగర్‌’అంటున్నారు. కేవలం జింక్‌ సరిపడా అందక ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

బియ్యం, గోధుమల్లో ఉన్న ఇనుము, జింక్‌లను సైతం శోషించుకోగలుగుతున్నది చాలా తక్కువే. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి, ఎట్టకేలకు అధిగమించే ఉపాయాన్ని కనుగొన్నారు. 

ఫైటిక్‌ ఆమ్లమే అడ్డంకి   
బియ్యంలోని ఫైటిక్‌ ఆమ్లం అనే పోషక నిరోధక పదార్థమే ఇనుము, జింక్‌ వంటి సూక్ష్మపోషకాల జీవ లభ్యత (బయో ఎవైలబిలిటీ)ని తగ్గిస్తోందని గుర్తించారు. అన్నంలో సహజంగా ఉండే ఇనుము, జింక్‌లను మనకు వంటబట్టకుండా ఫైటిక్‌ ఆమ్లం అడ్డుపడుతోంది. దాన్యాల్లో ఫైటిక్‌ ఆమ్లంను తగ్గించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సంప్రదాయ బ్రీడింగ్, జన్యు ఇంజనీరింగ్‌ పద్ధతుల్లో సరికొత్త వంగడాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు. వరి గింజలో ఉండే ఫాస్ఫరస్‌తో ఫైటిక్‌ ఆమ్లం ముడిపడి ఉంటుంది. దీంతో ఈ పంట రకాల పెరుగుదల, మొలక శాతం, బరువు తగ్గిపోవటం వంటి సమస్యలు వచ్చాయి. 

జింక్,ఐరన్‌ల రెట్టింపుశోషణ 
ఫిలిప్పీన్స్‌లోని ఐఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు ధాన్యంలో ఫైటిక్‌ ఆమ్లంను విజయవంతంగా తగ్గించగలిగారు. డాక్టర్‌ రోవెల్‌ టియోజోన్‌ జూనియర్, డాక్టర్‌ నెసె శ్రీనివాసులు తదితరుల బృందం ఈ విజయం సాధించింది. ఫైటిక్‌ ఆమ్లం ఉత్పత్తికి మూలమైన ఐఎన్‌ఓ1 అనే ఎంజైమ్‌ను గుర్తించారు. 

దాన్ని నియంత్రించే రసాయనాన్ని గింజ పోసుకునే దశలో వరి పంటపై పిచికారీ చేయడం ద్వారా గింజల్లో పోగుపడే ఫైటిక్‌ ఆమ్లం పాళ్లను తగ్గించే ఉపాయాన్ని కనిపెట్టారు. దీంతో బియ్యంలో 32%, గోధుమల్లో 47% మేరకు ఫైటిక్‌ ఆమ్లం తగ్గింది. దీంతో సూక్ష్మపోషకాల జీవ లభ్యతతోపాటు శోషణ స్థాయి పెరిగింది. ఈ బియ్యం తిన్నవారు జింక్, ఐరన్‌లను గతంలో కన్నా రెట్టింపు స్థాయిలో వంటబట్టించుకోగలిగారని ఐఆర్‌ఆర్‌ఐ తాజాగా ప్రకటించింది.  

అనేక పంటలకు ఉపయోగం 
జన్యుమారి్పడి తదితర టెక్నాలజీలతో వ్యయప్రయాసల కోర్చి ఇనుము, జింక్‌ అధికంగా ఉండే కొత్త ధాన్యపు పంటల వంగడాలను రూపొందించటం కన్నా.. ఇప్పటికే ఉన్న వంగడాలను సాగు చేసుకుంటూ గింజ పోసుకునే దశలో ఒక రసాయనాన్ని పిచికారీ చేస్తే సరిపోతుందని ఐఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ టెక్నిక్‌ వరి, గోధుమతోపాటు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, బార్లీ వంటి ఇతర పంటల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement