లద్దాఖ్‌ ధర్మభూమి: అమిత్‌ షా  | Ladakh remained a living land of dharma | Sakshi
Sakshi News home page

లద్దాఖ్‌ ధర్మభూమి: అమిత్‌ షా 

May 2 2026 5:10 AM | Updated on May 2 2026 5:10 AM

Ladakh remained a living land of dharma

లేహ్‌/జమ్మూ: శతాబ్దాలుగా బౌద్ధ జ్ఞానాన్ని పరిరక్షించి, పోషించి లద్దాక్‌ ‘సజీవ ధర్మభూమి’గా నిలిచిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బౌద్ధమతం సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా బుద్ధుని బోధనలను పరిరక్షించడానికి ఈ నేల కృషి చేసిందని, పరిరక్షించిన ఆ జ్ఞానాన్ని విస్తరించడానికి సహాయపడిందని కొనియాడారు. 75 ఏళ్ల తర్వాత బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలు లద్దాఖ్‌కు తిరిగి రావడాన్ని ‘చారిత్రక పునఃకలయిక’గా ఆయన అభివరి్ణంచారు. 

ఈ అవశేషాల పునరాగమనం లద్దాఖ్‌ ప్రజలకు బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యతను మరింత పెంచిందన్నారు. 2569వ బుద్ధ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం లేహ్‌లోని జీవేత్సల్‌లో తథాగతుని పవిత్ర అవశేశాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో బుద్ధుని బోధనల ప్రాముఖ్యతను షా నొక్కి చెప్పారు. జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని, దానిని అంతర్భాగం చేసుకోనంత వరకు మోక్షం సాధ్యం కాదన్నారు. 

‘ఆధ్యాత్మిక సాధన లేకుండా జ్ఞానం అసంపూర్ణం. జ్ఞానం లేని ఆధ్యాతి్మక సాధన అంధకారం. ఆధ్యాత్మిక సాధన, జ్ఞానం కలయికే సరైన మార్గం. ఇవన్నీ ఉన్నా నైతిక క్రమశిక్షణ లేకపోతే, జ్ఞానవంతమైన జీవితాన్ని గడపలేరు. నైతిక క్రమశిక్షణే జ్ఞానవంతమైన జీవితానికి ఆధారం’అని షా పేర్కొన్నారు. భారత్‌లో ఉద్భవించిన బుద్ధుని బోధనలు లద్దాఖ్‌ ద్వారా చైనా, అనేక ఇతర దేశాలకు వ్యాపించాయని, ఎంతో మంది జీవితాలకు మార్గదర్శకంగా మారాయని చెప్పారు. 

కశ్మీర్, లేహ్, యార్కండ్, ఖోటాన్, టిబెట్‌లను కలిపే సిల్క్‌ రూట్‌ వాణిజ్యానికి మాత్రమే కాకుండా, ఆలోచనలకు, గ్రంథాలకు, కళాత్మక సంప్రదాయాలకు వ్యాప్తికి ఒక మార్గంగా మారిందన్నారు. లేహ్‌లో పలు డైరీ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సభలో షా మాట్లాడారు. దేశ సరిహద్దులను కాపాడటంలో లద్దాఖ్, కార్గిల్‌ ప్రజలు చూపిన దేశభక్తిని, త్యాగాలను ప్రశంసించారు. సరిహద్దు నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా సైన్యం రావడానికి ముందు స్థానిక ప్రజలే దేశ రక్షణకు నిలబడ్డారని కొనియాడారు. ఏడేళ్ల తర్వాత తాను ఈ ప్రాంతాన్ని సందర్శించడం, బుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ ఉండటం ఆనందంగా ఉందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement