Kerala Trans Couple: పదేళ్ల పరిచయంలో ప్రేమ.. ప్రేమికుల రోజున పెళ్లి, చివరికి కోర్టుకు! సమాజం అంగీకరించకున్నా సరే..

Kerala Trans Couple Wedding: Couple Approach HC To Register Marriage - Sakshi

సమాజం.. ముఖ్యంగా మన చట్టాలు అంగీకరించని వ్యవహారం ఇది. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు వీరిద్దరి. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ, ఇలాంటి వాటిని నిందించే సమాజం కదా. అయినా పెద్దలు ధైర్యం చేశారు. స్నేహితులు తోడుగా నిలిచారు. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కేరళ తిరువనంతపురంలో ఫిబ్రవరి 14న  ఘనంగా జరిగింది ఈ ట్రాన్స్​ జంట వివాహం.
 
త్రిస్సూర్ కు చెందిన వరుడు మనూ కార్తీక టెక్నోపార్క్ లోని ఓ ఐటీ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఇక వధువు శ్యామా ఎస్. ప్రభ కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. 2010లో క్వీర్ ఉద్యమం సందర్భంగా ఇద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి పరిచయం కాస్త స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. 2017లో తొలిసారిగా మనూ, శ్యామకు ప్రపోజ్ చేశాడట. వీళ్ల శరీరతత్వాల గురించి తెలిసిన పెద్దలు.. వీళ్ల ప్రేమకి, పెళ్లికి సైతం అడ్డుచెప్పలేదు. అయితే..

వాళ్లిద్దరూ వాళ్ల వాళ్ల ఇంట్లో పెద్దవాళ్లు. దీంతో కొన్ని బాధ్యతలు పెళ్లికి అడ్డుపడ్డాయి. అవి తీరాక ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెద్దల సమక్షంలోనే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ముందుగా ప్రచారం జరగడంతో ట్రాన్స్​జెండర్లు సైతం భారీ ఎత్తున్న హాజరై.. ఈ జంటను ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పుడున్న వివాహ చట్టాల ప్రకారం వీళ్ల వివాహం ఆమోదయోగ్యం కాదు. అందుకే తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

ట్రాన్స్​జెండర్​ గుర్తింపు కింద తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరనున్నారు వీళ్లు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్నామని ఈ జంట చెబుతోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top