కర్ణాటక కొండల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన 14 ఏళ్ల కేరళ బాలిక నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసులు ముమ్మరంగా గాలించిన తర్వాత ఆమె మృతదేహం లభ్యం కాగా.. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద తన బంధువులతో సుమారు 40 మందితో కలిసి కర్ణాటక పర్యటనకు వచ్చింది. వీరు మొదట ఉత్తర కర్ణాటకలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హంపిని సందర్శించారు. ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చిక్కమగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రైవేట్ జీపుల్లో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి.. ఆ తర్వాత చంద్రద్రోణ కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.
ట్రెక్కింగ్ రోజున ఒక కుటుంబ సభ్యుడితో కలిసి ఉన్న వీడియోలో బాలిక చివరిసారిగా కనిపించింది. అయితే, ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చీకటి పడుతున్న సమయంలో ఆమె అదృశ్యమైంది. కొండల్లోని మాణిక్యధార ప్రాంతంలో ఆమెను చివరిగా చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన ఘాట్ ప్రదేశాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. లోతైన ప్రాంతాలకు వెళ్లేందుకు తాళ్లను కూడా ఉపయోగించారు. రాత్రి సమయాల్లో డ్రోన్ సర్వైలెన్స్, థర్మల్ కెమెరాలను వినియోగించారు. నాలుగు రోజులు పాటు గాలింపు అనంతరం మాణిక్యధార వ్యూ పాయింట్‌కు సుమారు 1,500 అడుగుల దిగువన ఉన్న లోయలో శ్రీనంద మృతదేహం లభ్యమైంది.
అయితే, బాలిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి స్పందిస్తూ.. బాలిక కిడ్నాప్ అయి ఉండవచ్చని ఒక వాదన ఉందని.. ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆచూకీ లభించిన నేపథ్యంలో వాస్తవాలు విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. పోలీసులు పలు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రమాదవశాత్తూ కొండపై నుండి జారిపడిందా? ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేల్చాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


