సిద్ధరామయ్య హయాంలో రూ.2,42,000 కోట్ల అప్పులు.. ప్రభుత్వ టీచర్‌ సస్పెండ్‌

Karnataka Teacher Suspended For Fb Post On Siddaramaiah Govt - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్‌ అయ్యారు.చిత్రదుర్గ జిల్లాలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు సీఎం సిద్ధరామయ్యను, ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత పథకాలను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వివిధ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులను శాతమూర్తి ప్రస్తావించాడు. ‘మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ హయాంలో రూ.3,590 కోట్లు.. ధరమ్‌సింగ్‌ రూ.15,635 కోట్లు, హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వంలో రూ.3,545 కోట్లు, బీఎస్‌ యడ్యూరప్ప హయాంలో రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్‌ షెట్టర్‌ రూ 13,464 కోట్లు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో రూ. 2,42,000 కోట్లు’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

అంతేగాక ఉచితాలు అధికంగా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోతుందంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా హయాం నుంచి శెట్టర్‌ వరకు రాష్ట్రం చేసిన రుణాలు రూ.71,331 కోట్లు కాగా.. కేవలం సిద్ధరామయ్య హయాంలోనే (2013-2018) అప్పులు రూ.2,42,000 కోట్లకు చేరాయని ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. దీంతో  ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తున్నట్లు విద్యాధికారి ఎల్‌ జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించాడని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకొని కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్‌ క్లారిటీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top