నూతన పాలసీ ఎఫెక్టు.. 40 లక్షల వాహనాలు తుక్కేనా? | Sakshi
Sakshi News home page

నూతన పాలసీ ఎఫెక్టు.. 40 లక్షల వాహనాలు తుక్కేనా?

Published Mon, Aug 16 2021 2:12 PM

Karnataka: Scrappage Policy May Affect 40 Lakh vehicles - Sakshi

బెంగళూరు: పాత వాహనాలను తుక్కు చేసేయాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంతో రాష్ట్రంలో లక్షలాది వాహనాలు గుజరీ దారి పట్టనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 2.46 కోట్ల వాహనాల్లో 40 లక్షలకు పైగా వాహనాలు ఈ జాబితాలోకి వస్తాయి. కొత్త స్క్రాప్‌ చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన  వాహనాలను తుక్కు కింద మారిస్తే కేంద్రం పలు ప్రోత్సాహకాలను అందించనుంది.  అలా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం చట్టం ఉద్దేశం.  

9 లక్షల పెద్ద వాహనాలు  31 లక్షల బైక్‌లు  
15 ఏళ్లకు పైబడిన మ్యాక్సిక్యాబ్‌లు, కారు, ఆటోరిక్షా, బస్సు, లారీలతో పాటు 9 లక్షలకు పైగా వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. 20 ఏళ్లు దాటిన 31 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. యజమానులు స్వయంప్రేరితంగా గుజరికి వేసేయవచ్చు. లేదా మూడు సార్లు ఫిట్‌నెస్‌ పరీక్ష విఫలమైతే రవాణా శాఖ వాటిని స్క్రాప్‌కి తరలిస్తుంది. ఒకవేళ ఎప్‌సీ పరీక్షలో పాసైనప్పటికీ గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించడం యజమానికి ఆర్థిక భారమే.  

వ్యాపారులు, మెకానిక్‌లలో భయం 
ఈ చట్టంతో పాత కార్లు, లారీలు కలిగి ఉన్న వారిలో భయం నెలకొంది. పాత కార్ల వ్యాపారుల్లోనూ గుబులు ఏర్పడింది. లక్షలు పెట్టి కార్లు కొనలేనివారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారు తక్కువ ధరతో పాత కార్లను కొని మోజుతీర్చుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం పడిపోయే ప్రమాదం ఉందని ఓ పాత కార్ల వ్యాపారి మధు తెలిపారు.  పాత వాహనాలను నమ్ముకుని గ్యారేజ్‌లు నిర్వహిస్తున్న మెకానిక్‌లు జీవనానికి  కొత్త చట్టంతో ఇబ్బందులే అన్నారు. అన్ని పాత వాహనాల్నీ గుజరీకి తరలిస్తే రిపేరి పనులు తగ్గిపోతాయని మెకానిక్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.  ఈ చట్టం వల్ల తమ కుటుంబాలు వీధిపాలవుతాయని లారీ యజమానుల సంఘాల ఒక్కోట అధ్యక్షుడు బి.చెన్నారెడ్డి అన్నారు. 10–11 ఏళ్లు దాటిన పాత లారీలు స్థానికంగా తిరుగుతూ ఎంతోకొంత ఉపాధినిస్తుంటాయి. అలాంటి లారీల యజమానులకు ఏమీ పాలు పోవడం లేదని అన్నారు.

Advertisement
Advertisement