అనూహ్యం.. ఆసక్తికరం | Karnataka Chief Minister Siddaramaiah Political Journey | Sakshi
Sakshi News home page

అనూహ్యం.. ఆసక్తికరం

May 29 2026 1:45 AM | Updated on May 29 2026 1:45 AM

Karnataka Chief Minister Siddaramaiah Political Journey

 సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం

బెంగళూరు: మైసూరు దగ్గర్లోని ఓ పల్లెలో పేద కుటుంబంలో జన్మించి, కర్ణాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్దు సొంతం చేసుకున్న సిద్ధరామయ్య ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం. ఒకప్పుడు జనతా పరివార్‌లో కరడుగట్టిన కాంగ్రెస్‌ వ్యతిరేకి. తిరిగి అదే పార్టీలో చేరి సత్తా చాటుకోవడం ఈయన ప్రత్యేకత. రెండోసారి ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేసి, తన రాజకీయ ప్రస్థానానికి ఘనమైన ముగింపు పలికేందుకు ప్రణాళికలు వేసుకున్న సిద్ధరామయ్య(77)కు పార్టీ షాకిచ్చింది. 

రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి యోచనలో ఉన్న అధిష్టానం అనూహ్యంగా రెండేళ్లు ముందుగానే పదవికి రాజీనామా చేయాలని కోరింది. రాష్ట్రంలో దీర్ఘకాలంపాటు సీఎంగా పనిచేసిన దేవరాజ్‌ ఉర్స్‌ నెలకొల్పిన 2,792 రోజుల రికార్డును రెండో విడత సీఎం అయిన సిద్ధరామయ్య ఈ ఏడాది జనవరి 7వ తేదీన తిరగరాశారు. ఇంతలోనే పదవి వీడాల్సిన పరిస్థితులు ఏర్పడటం గమనార్హం. 

1983లో చాముండేశ్వరి సీటు  
1948 ఆగస్ట్‌ 3వ తేదీన మైసూరు జిల్లా సిద్ధరామనహండీ అనే గ్రామంలో జన్మించిన సిద్ధరామయ్య మైసూర్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అదే వర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగాను ప్రాక్టీస్‌ చేశారు. సిద్ధరామయ్య భార్య పార్వతి. చిన్న కుమారుడు యతీంద్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. రాజకీయ వారసుడవుతారని భావించిన పెద్ద కుమారుడు రాకేశ్‌ 2016లో చనిపోయారు. లోక్‌దళ్‌ పార్టీ టికెట్‌పై మొట్టమొదటిసారిగా 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మైసూరులోని చాముండేశ్వరి సీటును గెలుచుకున్నారు సిద్ధరామయ్య. 

అనంతరం జనతా పార్టీలో చేరి కన్నడ కావలి సమితి అధ్యక్షుడిగా కన్నడ భాష పరిరక్షణకు ఉద్యమాలు చేపట్టారు. ఆయన కృషితోనే రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం కన్నడను అధికార భాషగా ప్రకటించింది. అనంతరం ఆయన పట్టు పరిశ్రమ శాఖ మంత్రి అయ్యారు. కాగా, దేశంలో సామ్యవాదం, లౌకిక, గాంధేయవాదం ఆధారంగా ఏర్పడిన రాజకీయ సిద్ధాంతమే జనతా పరివార్‌. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచిన పార్టీల కూటమి. ఇందులోనివే జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, సమాజ్‌వాదీ పార్టీ, బిజూ జనతా దళ్‌ పార్టీలు. 

2004లో ఏమైందంటే.. 
ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 2004లో కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ నేత ధరమ్‌సింగ్‌ సీఎం పదవిని చేపట్టగా, జేడీఎస్‌లో ఉన్న సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం అయ్యారు. సీఎం పదవి చేపట్టే అర్హత తనకుందని సిద్ధరామయ్య వాదించినప్పటికీ దేవెగౌడ ఆయన మాటలను పెడచెవిన పెట్టారు. కర్ణాటకలో మూడో అతిపెద్ద కులం కురుబకు చెందిన సిద్ధరామయ్య 2005లో వెనుకబడిన వర్గాల నేతగా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అనేక సభలు నిర్వహించారు. 

జేడీఎస్‌లో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి వారసుడిగా ఎదుగుతుండటమే ఇందుకు కారణం. అనంతర కాలంలో జేడీఎస్‌ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. దీంతో, సిద్ధరామయ్య డైలమాలో పడ్డారు. తిరిగి న్యాయవాద వృత్తిని కొనసాగించేందుకు రాజకీయ సన్యాసం కూడా తీసుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఆయన్ను ఆహ్వానించాయి కూడా. బీజేపీ సిద్ధాంతాలు నచ్చని సిద్ధరామయ్య, చివరికి తాను వ్యతిరేకించిన కాంగ్రెస్‌లోనే 2006లో తన అనుచరులతోపాటు చేరారు. 

కాంగ్రెస్‌లో చేరుతానని అప్పటి వరకు అనుకోలేదని ఆయనే ఒక సందర్భంలో చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన చూపిన ఓర్పు, పట్టుదల చివరకు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ముక్కుసూటితనానికి మారుపేరైన సిద్ధరామయ్య 2013లో ముఖ్యమంత్రి అయ్యి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇవే లక్షణాలు ఆయన్ను తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించాయి. ఐదేళ్ల విరామం అనంతరం 2023లో మరోసారి సీఎం కురీ్చపై కూర్చోబెట్టాయి. రాష్ట్ర ఆర్థికమంత్రిగా 17సార్లు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు సిద్ధరామయ్య పేరిట ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement