కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత
మంత్రులు, ఇతర నాయకులకు అల్పాహార విందు
అధిష్టానం ఆదేశాల మేరకు మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
రానున్న రెండేళ్లు డీకే శివకుమార్ సీఎంగా కొనసాగుతారని స్పష్టీకరణ
అనంతరం లోక్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీకి వేర్వేరుగా పయనమైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్
ప్రభుత్వ ఏర్పాటుపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార మార్పిడికి అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన గురువారం మధ్యాహ్నం బెంగళూరులోని లోక్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో లోక్‌భవన్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు రాజీనామా లేఖను అందజేశారు.
ఈ సందర్భంగా సిద్ధరామయ్య వెంట ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఉన్నారు. శుక్రవారం సాయంత్రంలోగా గవర్నర్ లోక్‌భవన్‌కు తిరిగి వస్తారని, వీలైతే ఒకసారి వచ్చి రాజీనామా విషయాన్ని స్వయంగా గవర్నర్‌కు తెలియజేయాలని ప్రభుశంకర్ కోరారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పయనమయ్యారు.
బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య రాజీనామాను అధికారికంగా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా సమర్పించిన లోక్‌భవన్ నుంచి బయటకు వచ్చిన సిద్ధరామయ్యకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. వందలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజీనామా చేయవద్దని కోరారు. సిద్ధరామయ్య కారుకు అడ్డుతగిలారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతా..
రాజీనామా సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు పంపిస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని వినమ్రంగా ఆ వినతిని తోసిపుచ్చినట్లు చెప్పారు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజలు తమకు ఐదేళ్లపాటు పదవీకాలం ఇచ్చారని, ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉందని, అప్పటివరకు వారి కోసం కోసం పని చేయాల్సి ఉందని అధిష్టానానికి చెప్పినట్లు వెల్లడించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయం మేరకు నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందన్నారు.
ఢిల్లీ బదులు జైపూర్‌కు సిద్ధరామయ్య విమానం
రాజీనామా అనంతరం సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణదీప్ సూర్జేవాలాతోపాటు తన వర్గం మంత్రులు, నాయకులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ విమానాన్ని రాజస్తాన్‌లోని జైపూర్‌లో ల్యాండ్ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) ప్రకటించింది.
తదుపరి సీఎం ఎంపికతోపాటు కేబినెట్ ఏర్పాటు గురించి అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు సిద్ధరామయ్య ఢిల్లీకి పయనమైనట్లు సమాచారం. తన వర్గం ఎమ్మెల్యేలకు గరిష్ట సంఖ్యలో మంత్రి పదవులు ఇప్పించుకోవాలని ఆయన యోచిస్తున్నారు. సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీకి చేరుకొనే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మరో విమానంలో గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. శుక్రవారం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎన్నిక, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ఆందోళన
సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన అనుచరులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తగా ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై మండిపడ్డారు. సిద్ధరామయ్యతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కురుబ సామాజిక వర్గం నాయకులు సైతం సిద్ధరామయ్య రాజీనామాను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారమే సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం
రాజీనామాకు ముందు సీఎం సిద్ధరామయ్య గురువారం ఉదయం సహచర మంత్రులకు తన అధికారిక నివాసం ‘కావేరి’లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సుమారు గంటన్నర పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు పాలనలో తనకు సహకరించిన మంత్రులకు సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలియజేశారు. హైకమాండ్ ఆదేశాలను శిరసావహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. రాజీనామాకు గల కారణాలను వివరించారు.
2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో జరిగిన అంతర్గత ఒప్పందంతోపాటు ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం అధిష్టానం సూచనల మేరకు రాజీనామా చేయాల్సి వస్తోందని స్పష్టంచేశారు. ఇకపైనా ప్రజలకు మంచి పాలన అందించాలని, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలని సహచర మంత్రులకు సూచించారు. రానున్న రెండేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనకు అందరూ పూర్తి సహకారం అందించాలని సిద్ధరామయ్య కోరినట్లు తెలిసింది. ఈ అల్పాహార విందులో డీకే శివకుమార్ సైతం పాల్గొన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు పక్కపక్కనే కూర్చొన్నారు.
సిద్ధరామయ్యను చూసిన వెంటనే డీకే శివకుమార్ ఆయనకు పాదాభివందనం చేశారు. డీకే శివకుమార్‌ను సిద్ధరామయ్య పైకి లేపి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో సిద్ధరామయ్య నవ్వుతూ కనిపించగా, డీకే శివకుమార్ కొద్దిగా భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. ఇరువురు నేతలు దాదాపు అరగంట పాటు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే, సిద్ధరామయ్య రాజీనామా సమర్పించిన అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, నూతన సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకుంటారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, సీఎల్పీ భేటీ జరగకపోవడం గమనార్హం.


